Chandrababu: కందుకూరు ఘటనలో నాపై కూడా కేసులు పెట్టే ప్రయత్నం..
ABN , First Publish Date - 2022-12-31T12:58:01+05:30 IST
కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నామని, వైసీపీ (YCP) ప్రభుత్వంలో బాదుడు, విధ్వంసాలు, వేధింపులుగా ఈ ఏడాది మిగిలిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు.
నెల్లూరు (Nellore): కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నామని, వైసీపీ (YCP) ప్రభుత్వంలో బాదుడు, విధ్వంసాలు, వేధింపులుగా ఈ ఏడాది మిగిలిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శనివారం నెల్లూరులో మాట్లాడుతూ విధ్వంసాల ఫలితం ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారని, ఇదేమని ప్రశ్నిస్తే మానసిక క్షోభ, శారీరక వేధింపులు. పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బందిపెట్టారని, వైసీపీ రౌడీలు, సైకోలు (Psychos) ఊరికొక్కరు చొప్పున తయారయ్యారన్నారు. మనంతా బాధపడుతుంటే జగన్ (Jagan), అతని పక్కన ఉండే వారు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. కందుకూరు (Kandukuru) ఘటనలో తనపై కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. బాబాయి వైఎస్ వివేక (YS Viveka)ను చంపినోడిపై చర్యలు లేవని విమర్శించారు. ఆయన 11వ తేదీన మంత్రి అయితే ఆ మరుసటి రోజు కోర్టులో ఫైళ్లు మాయమయ్యాయని, చివరికి జడ్జీలను కూడా బెదిరించే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు, మీడియా, న్యాయవ్యవస్థలపై దాడి... అత్యంత సహనంగా ఉండే తనలాంటి వాడు కూడా భరించలేరని అన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులన్నీ పక్కదారి పట్టించారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఏపీని విపరీతమైన అప్పుల్లోకి తీసుకువెళ్లారని, కౌలుకి వ్యవసాయం చేసే వారు లేరని, 16వందలకి పైగా కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ధాన్యం దళారులు, వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు రైతులను దోచుకున్నారని, ఆర్బీకే వ్యవస్థ లేని భూములు సృష్టిస్తున్నాయన్నారు. కేంద్రం రూ.2700 కోట్ల బియ్యం పేదల కోసం ఇస్తే.. ప్రభుత్వం పంపిణీ చేయలేదని ఆరోపించారు. మద్యంలో హోల్ సేల్, రిటైల్.. అన్నింటిలో జగన్ మనుషులే ఉన్నారని, అత్యధిక ధరలతో మద్యం తాగలేక చాలా మంది గంజాయికి అలవాటు పడుతున్నారన్నారు. ఏపీ గంజాయి, డ్రగ్స్ మాఫియాకి కేంద్రంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు.