Varla Ramaiah: హంతకుడికి గజమాలతో స్వాగతమా?
ABN , First Publish Date - 2022-12-15T15:37:56+05:30 IST
దళితుల పట్ల జగన్(Cm jagan)కు బంధు ప్రీతి ఎలా ఉంటుంది..? జగన్‌తో చుట్టరికం ఉంటుందనుకుని ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ అసలు స్వరూపం బయటపడింది
అమరావతి: దళితుడిని చంపిన అనంతబాబు (YCP MLC Ananta Babu)కు గజమాల వేసి ర్యాలీగా తీసుకెళ్తారా..? అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (TDP Varla Ramaiah) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఓ దళితుడ్ని హత్య చేసి అనంతబాబు జైల్లో ఉంటే శిలాఫలకాల మీద పేర్లు వేస్తారా..? జైలు నుంచి వచ్చే దాకా కొన్ని ప్రారంభోత్సవాలు కూడా ఆపేస్తారా..? అనంతబాబు సచ్చీలుడని చెప్పే ప్రయత్నం చేస్తారా..? దళితులు మా బంధువులు.. మేనత్త, మేనమామలని జగన్ గతంలో చెప్పారు. దళితుల పట్ల జగన్(Cm jagan)కు బంధు ప్రీతి ఎలా ఉంటుంది..? జగన్‌తో చుట్టరికం ఉంటుందనుకుని ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ అసలు స్వరూపం బయటపడింది. అనంతబాబు(YCP MLC Anantha Babu) ఓ దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేస్తే.. కేసు దర్యాప్తు చేయడానికి కూడా పోలీసులు ఇష్టపడ లేదు. ఓ పోలీస్ కానిస్టేబులును ఎంక్వైరీ చేయమంటే ఈపాటికి తేల్చేసేవారు. దళితుడ్ని హత్య చేస్తే తొమ్మిది సార్లు తప్పుడు ఛార్జ్షీట్లు దాఖలు చేస్తారా..? డ్రైవర్ సుబ్రమణ్యాన్ని(Driver Subramaniam) అనంతబాబు ఎందుకు చంపారో ఇప్పటికీ తేల్చలేదు. సుబ్రమణ్యం వద్ద అనంతబాబు గుట్టు ఏముందో తేల్చారా..? ప్రభుత్వం అనంతబాబు పక్షమా..? హత్యకు గురైన దళితుడు సుబ్రమణ్యం పక్షమా..? కేసును సీబీఐకు అప్పగించాలని ప్రభుత్వం డిమాండ్ చేయాలి. అనంతబాబు బయటకు రావడంతో సుబ్రమణ్యం కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. సుబ్రమణ్యం కుటుంబానికి.. దళిత సంఘాల నేతలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. తలంచుకుని వెళ్లాల్సిన అనంతబాబు జైలు నుంచి రాగానే చేయి ఊపుతూ వెళ్తారా..? అనంతబాబు చేపట్టిన ర్యాలీ చూసి దళిత మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో ముల్లు గుచ్చుకోలేదా..? దళిత మంత్రులు ఇంకా కేబినెట్లో ఉండడంలో అర్థం ఉందా..? సీఎం అనే ఇనుప పాదాల కింద దళితులను జగన్ తొక్కుతున్నారు. ఎంతో మంది దళితులని ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. దళితులు.. జగన్ బంధువులైతే కిమ్మనకుండా ఎందుకుంటున్నారు..?.’’ అని వర్ల రామయ్య నిలదీశారు.