NGO State President: 11వ పీఆర్సీ ఒక అభూత కల్పన
ABN , First Publish Date - 2022-12-16T13:26:42+05:30 IST
11వ పీఆర్సీ ఒక అభూత కల్పన అని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: 11వ పీఆర్సీ ఒక అభూత కల్పన అని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు (NGO State President Bandi Srinivasa Rao) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి కూలీల కంటే హీనంగా మారిందన్నారు. ఉద్యోగులు నెలంతా పని చేస్తే 31న జీతం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పాలు, కూరగాయల, బ్యాంకుల వాళ్ళ వద్ద కూడా లోకువ అయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించాకే ఐఏఎస్‌లకు జీతాలు అని నోటిమాటగా చెప్పడమే అమల్లో లేదని అన్నారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ 62 రెండేళ్ల ఉద్యోగ విరమణ వయస్సు వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకూ బదిలీ ప్రక్రియ చేపట్టాలన్నారు. జీపీఎఫ్ నిధులు ఉద్యోగులకు ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఉద్యోగులను సంక్షోభంలోకి ఎందుకు నెడుతున్నారని నిలదీశారు. సామాజిక పెన్షన్లు నెలలో ఒకటో తారీఖున ఇస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల్లో పెన్షనర్లను కూడా వృద్ధులకు ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఏ ప్రభుత్వంతోనూ ఉద్యోగుల సంఘాలకు లాలూచీ లేదని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.