CM JAGAN: ముఖ్యమంత్రా.. మజాకా!

ABN , First Publish Date - 2022-11-21T03:20:47+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం పర్యటన నేపథ్యంలో నరసాపురం ఖాకీవనంలా మారింది. పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. బందోబస్తు కోసం పశ్చిమగోదావరి జిల్లా నుంచే

CM JAGAN: ముఖ్యమంత్రా.. మజాకా!

పోలీసు దిగ్బంధంలో నరసాపురం

పొరుగు జిల్లాల నుంచి 2 వేల బలగాలు

5 కిలోమీటర్ల మేర ఇనుప బారికేడ్లు

ఒక రోజు ముందే దుకాణాలు బంద్‌

స్కూళ్లు, కళాశాలలకు సెలవు

విద్యాసంస్థల బస్సులన్నీ జన సమీకరణకే

దాదాపు 700 బస్సులు ఏర్పాటు

నరసాపురం, అమరావతి(ఆంధ్రజ్యోతి): నవంబరు 20: ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం పర్యటన నేపథ్యంలో నరసాపురం ఖాకీవనంలా మారింది. పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. బందోబస్తు కోసం పశ్చిమగోదావరి జిల్లా నుంచే కాకుండా కృష్ణా, తూర్పు జిల్లాల నుంచి కూడా దాదాపు 2 వేల మంది పోలీసులను రప్పించారు. సీఎం దిగే హెలిప్యాడ్‌ నుంచి సభ వేదిక వరకు దాదాపు 5 కిలోమీటర్ల పొడవునా.. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే సమయంలో జనం రోడ్డు మీదకు రాకుండా తెరలు కడుతున్నారు. ఆదివారం పాతబజార్‌లోని దుకాణాలన్నీ మూసివేశారు. ఈ ఆంక్షలు సోమవారం సీఎం వచ్చి వెళ్లే వరకు ఉంటాయని.. దుకాణాలు మూసివేయాల్సిందేనని ఆదేశించారు. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. జనసమీకరణ కోసం అన్ని విద్యా సంస్థల బస్సులను స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం నియోజకవర్గం నుంచే కాకుండా పాలకొల్లు, భీమవరం, తణుకు నుంచి కూడా జనాన్ని తరలించడానికి 700 బస్సులు సిద్ధం చేశారు. జనసమీకరణ బాధ్యతను వలంటీర్లు, డ్వాక్రా సంఘాలు, గ్రామస్థాయి సిబ్బందికి అప్పగించారు. భోజనాలు, బస్సులకు ఆయిల్‌ ఇతర ఖర్చుల భారాన్ని తమపై మోపారని మండల స్థాయిు అధికారులు వాపోతున్నారు.

40 ఎకరాల్లో మత్స్య వర్సిటీ

రాష్ట్ర మత్స్య విశ్వవిద్యాలయానికి సోమవారం సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని సరిపల్లి, లిఖితపూడి మధ్య 40 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనా వ్యయంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండో దశ పనుల్లో బియ్యపుతిప్ప వద్ద 350 ఎకరాల్లో రూ.222 కోట్లతో సముద్ర తీరప్రాంగణం, పరిశోధనా కేంద్రం నిర్మిస్తారు. బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌కు కూడా జగన్‌ శంకుస్థాపన చేస్తారు. నరసాపురం ప్రాంతీయ వైద్యశాఖ నూతన భవనం, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

Updated Date - 2022-11-21T03:32:19+05:30 IST

Read more