Macherla: నివురుగప్పిన నిప్పులా మాచర్ల.. కొనసాగుతున్న 144 సెక్షన్..

ABN , First Publish Date - 2022-12-17T11:09:45+05:30 IST

పల్నాడు జిల్లా (Palnadu Dist.): ప్రశాంతంగా ఉండే మాచర్ల (Macherla) ఒక్కసారిగా భగ్గుమన్నది. మాటల మంటలు రాజేసింది. నివురుగప్పిన నిప్పులా మారింది.

Macherla: నివురుగప్పిన నిప్పులా మాచర్ల.. కొనసాగుతున్న 144 సెక్షన్..

పల్నాడు జిల్లా (Palnadu Dist.): ప్రశాంతంగా ఉండే మాచర్ల (Macherla) ఒక్కసారిగా భగ్గుమన్నది. మాటల మంటలు రాజేసింది. నివురుగప్పిన నిప్పులా మారింది. రాళ్లు, సీసాలు, కర్రలతో వైసీపీ (YCP) గూండాలు చెలరేగి పోయారు. విధ్వంసకాండ సృష్టించారు. ఇది మా రాజ్యం. ఇక్కడ మరొక పార్టీ వాళ్లు ప్రచారానికి రాకూడదంటూ వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన టీడీపీ (TDP) కార్యకర్తలు, నేతలపై రాళ్లు, కర్రలు, సీసాలతో దాడికి దిగారు. వాహనాలు, ఇళ్లు, దుకాణాలను తగలబెట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా మాచర్ల మండుతూనే ఉంది. దీంతో అక్కడ 144 సెక్షన్ (144 Section) కొనసాగుతోంది.

పల్నాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి మూడు రోజులుగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయం ఉన్న ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇది... మాచర్ల మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ తురకా కిశోర్‌ సొంత ప్రాంతం! స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న తదితరులున్న వాహనంపై కర్రలతో దాడి చేసింది ఈయనే! ఇక్కడ టీడీపీ కార్యక్రమం జరిగేందుకు వీల్లేదని, ఎలాగైనా అడ్డుకోవాలని ముందుగానే వైసీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం నుంచే బైకులపై తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో టీడీపీ నేతలు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ప్రారంభించి... ఇంటింటికీ తిరుగుతూ మునిసిపల్‌ కార్యాలయం సమీపానికి వచ్చారు. అదే సమయంలో సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై కర్రలు, రాళ్లు, సీసాలతో దాడికి దిగారు. తమ ప్రాంతంలో తిరగడానికి వీల్లేదని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కితగ్గకుండా ఎదురు నిలబడ్డారు. వైసీపీ శ్రేణుల దాడులను గట్టిగా తిప్పికొట్టారు. దీంతో మాచర్ల వీధుల్లో హోరాహోరీ మొదలైంది. ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడ్డారు.

విషయం తెలుసుకున్న జూలకంటి బ్రహ్మారెడ్డి వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రశాంతంగా మా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోకుండా... మాపై లాఠీ చార్జీ చేస్తారా? అని పోలీసులను ప్రశ్నించారు. ఉదయం నుంచే వైసీపీ నేతలు రాడ్లు, కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలను ఏమీ చేయలేక తమపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మాచర్ల నుంచి తక్షణం వెళ్లిపోవాలని బ్రహ్మారెడ్డిని సీఐ సమివుల్లా కోరారు. ఇందుకు ఆయన ససేమిరా అన్నారు. తాము కచ్చితంగా కార్యక్రమం నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. దాంతో సీఐ సమివుల్లా బలవంతంగా బ్రహ్మారెడ్డిని నెట్టుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. ఇది చూసిన టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. పోలీసులు మరోసారి వారిపై లాఠీచార్జి చేశారు. బ్రహ్మారెడ్డికి కూడా లాఠీ దెబ్బలు తగిలాయి. కార్యకర్తలు ఆయన చుట్టూ రక్షణగా నిలబడి ‘జై బ్రహ్మారెడ్డి, జై టీడీపీ’ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బ్రహ్మారెడ్డి ముందుకు సాగారు. పోలీసులు మళ్లీ రంగంలోకి దిగి బ్రహ్మారెడ్డిని వాహనంలో ఎక్కించి గుంటూరుకు తీసుకెళ్లారు.

వెనక్కి తగ్గినట్లే తగ్గిన వైసీపీ కార్యకర్తలు గంటన్నరలోనే మళ్లీ రెచ్చిపోయారు. గుంపులు గుంపులుగా విడిపోయి కర్రలతో హల్‌చల్‌ చేశారు. టీడీపీ కార్యకర్తల దుకాణాలు, వాహనాలపై దాడికి దిగారు. రింగు రోడ్డు సెంటర్‌, రైలు గేటు దగ్గర వాహనాలకు నిప్పటించారు. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లను చుట్టుముట్టారు. మాచర్లలో బ్రహ్మారెడ్డి తన కార్యాలయంగా, నివాసంగా వాడుకుంటున్న భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ ప్రాంతంలో కరెంటు తీయించారు. సుమారు వందమంది అక్కడికి వెళ్లి ఆ ఇంటిని ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ను పెట్రోలుపోసి తగలబెట్టారు.

అలాగే బ్రహ్మారెడ్డికి అత్యంత సన్నిహితులైన యర్రం పోలురెడ్డి, గొట్టిపాళ్ల గృహాలను కూడా ధ్వంసం చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో రెండు స్కార్పియోలు దెబ్బతిన్నాయి. మరో స్కార్పియో దహనమైంది. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ విధ్వంసం ఆగలేదు.

మాచర్ల ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పోలీసుల ఎదుటే వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. ఈ ఘటనను టీడీపీ తీవ్రంగా ఖండించింది. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం దారుణమన్నారు.

చంద్రబాబు ఆగ్రహం

మాచర్లలో వైసీపీ హింసకు పాల్పడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులపై దాడి చేసి, పార్టీ నేతల ఇళ్లకు, పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనలను తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ముకాస్తారా? అని మండిపడ్డారు. గుంటూరు రేంజ్‌ డీఐజీకి ఫోన్‌ చేశారు. మాచర్లలో పరిస్థితులు దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వైసీపీ గూండాలు అరాచకాలకు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. మాచర్ల టీడీపీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని అరెస్టు చేయడాన్ని అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. తక్షణమే బ్రహ్మారెడ్డిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

టీడీపీ శ్రేణులపై దాడి దారుణం.. లోకేష్

వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహకారంతో మరోసారి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమని నారా లోకేష్‌ విమర్శించారు... దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసి పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవటం వైసీపీకి కొమ్ముకాయడమేనని ధ్వజమెత్తారు. మాచర్లలో హత్యా రాజకీయాలను జగన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, కేఎస్‌ జవహర్‌ ఆరోపించారు. వైసీపీ సమాధికి మాచర్ల ఘటన తొలి పునాది రాయి అని అన్నారు.

మాచర్లలో అధికార పార్టీ నేతలు చెప్పినట్లు నడుచుకోవడమే పోలీసుల విధిగా మారింది. టీడీపీ వారిపై తప్పుడు కేసులు బనాయించడం, విపక్షంలో చురుగ్గా ఉండే వారిని స్టేషన్‌కు రప్పించి బెదిరించడం షరామామూలే.

Updated Date - 2022-12-17T11:09:50+05:30 IST