Narayana : మీ రాజకీయాల్లో మేం తలదూర్చం

ABN , First Publish Date - 2022-11-08T05:02:12+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మాజీ మంత్రి పి.నారాయణకు హైకోర్టు మంజూరుచేసిన ..

Narayana : మీ రాజకీయాల్లో మేం తలదూర్చం

సీఐడీకి సుప్రీం షాక్‌!

మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్‌ రద్దుకు నో

దర్యాప్తునకు సహకరించకుంటే బెయిల్‌ రద్దు పిటిషన్‌ వేసుకోండి

ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్ర, తెలంగాణ నుంచి చాలా లిటిగేషన్లు వస్తున్నాయని వ్యాఖ్య

న్యూఢిల్లీ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సీఐడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మాజీ మంత్రి పి.నారాయణకు హైకోర్టు మంజూరుచేసిన ముందస్తు బెయిల్‌ను రద్దుచేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. మీ రాజకీయ అంశాల్లో తాము తలదూర్చదలచుకోలేదని స్పష్టం చేసింది. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌తో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌ కేపీవీ అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌కు సెప్టెంబరులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దానిని సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీన్‌ రావల్‌ వాదనలు వినిపించారు. ఆర్థిక సంబంధిత నేరాల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని గతంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని ప్రస్తావించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి చాలా లిటిగేషన్లు వస్తున్నాయని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

వాటి గురించి తనకు తెలియదన్న రావల్‌.. నిందితులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో మౌఖిక ఆదేశాలతో అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారని వివరించారు. ‘2018లోనే ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఇప్పటికి ఆరేళ్లు గడిచింది. అదేమంత ఆలస్యం కాదు. ఆరేళ్ల తర్వాత కేసు నమోదు చేయడం ఏమిటని అనడం సరికాదు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడే హైకోర్టు కేసును విచారణకు స్వీకరించింది’ అని తెలిపారు. ఏ నిబంధనల కింద కేసు నమోదు చేశారు.. వారిపై ఏయే అభియోగాలు ఉన్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఐసీపీ సెక్షన్లు 120 (బీ), 420, 166, 167. 217, అవినీతి నిరోఽధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌ విత్‌ 13(1)(ఏ) కింద కేసు నమోదు చేసినట్లు రావల్‌ బదులిచ్చారు. ఇవన్నీ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో జరిగిన నేరాలా అని ధర్మాసనం అడుగగా.. మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించి కాదని, అధికార దుర్వినియోగానికి పాల్పడి కొంత మంది వ్యక్తులకు ప్రయోజనం కలిగించేలా ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్చారన్న ఆరోపణలు ఉన్నాయని ఆయన తెలిపారు. ‘మీరు విచారణ కొనసాగించవచ్చు కదా! దర్యాప్తుపై ముందుకెళ్లవచ్చు కదా’ అని ధర్మాసనం అనగా.. నిందితులు సహకరించడం లేదని, పైగా ఇవి ఆర్థిక నేరాలని రావల్‌ పేర్కొన్నారు. ఈ దశలో ధర్మాసనం డిస్మిస్‌ ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రయత్నించగా.. సీనియర్‌ న్యాయవాది అడ్డుకుని.. వాదనలు కొనసాగించే ప్రయత్నం చేశారు. మీరు ఇలాగే వాదిస్తే పిటిషన్‌ కొట్టివేస్తామని కోర్టు హెచ్చరించింది. ఈ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. సీఐడీ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలు దర్యాప్తులో ప్రభావితం కాకూడదని స్పష్టం చేసింది. నిందితులు సహకరించకపోతే బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సీఐడీకి సూచించింది.

Updated Date - 2022-11-08T05:02:21+05:30 IST