సంక్షేమ హాస్టళ్లకు పైసల్లేవ్‌!

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:53 PM

సంక్షేమ హాస్టళ్లలో మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీల బకాయిలు పేరుకుపోయాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ హాస్టళ్లకు సంబంధించి రూ. కోట్లల్లో బిల్లులు తొమ్మిది నెలలుగా విడుదల కావడంలేదు.

సంగారెడ్డి జిల్లాలో 93 సంక్షేమ హాస్టళ్లు

డైట్‌ చార్జీల బకాయిలు రూ. 6.61 కోట్లు

కాస్మొటిక్‌ చార్జీల బకాయిలు రూ. 46,22,702

తలకుమించిన భారంగా వసతి గృహాల నిర్వహణ

అప్పు చేసి సరుకులు కొనుగోలు చేస్తున్న వార్డెన్లు

పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధికారులు

సంగారెడ్డి అర్బన్‌, జనవరి 18 : సంక్షేమ హాస్టళ్లలో మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీల బకాయిలు పేరుకుపోయాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ హాస్టళ్లకు సంబంధించి రూ. కోట్లల్లో బిల్లులు తొమ్మిది నెలలుగా విడుదల కావడంలేదు. నిధులు లేక అప్పులు చేసి సరుకులు తెచ్చిస్తున్న వార్డెన్లు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదని, ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తేనే విద్యార్థులకు మెనూ అమలు చేయగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు ఇలా

సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మెస్‌ చార్జీలను చెల్లిస్తున్నది. 3 నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.950 చొప్పున చెల్లిస్తున్నది. 8 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,100, ఇంటర్మీడియట్‌ నుంచి డిగ్రీ వరకు ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,500 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇందులోనే వంట గ్యాస్‌, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, గుడ్డు, పాలు, రాత్రి భోజనం, వారానికి రెండుసార్లు చికెన్‌ అందజేయాల్సి ఉంటుంది. ఇక కాస్మోటిక్‌ చార్జీల విషయానికొస్తే నెలకు బాలురకు రూ.62, బాలికలకు రూ.75 చెల్లిస్తారు. సంగారెడ్డి జిల్లాలో 93 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వీటికి డైట్‌ చార్జీల బకాయిలు రూ. 6.61 కోట్లు, కాస్మొటిక్‌ చార్జీల బకాయిలు రూ. 46,22,702 చెల్లించాల్సి ఉన్నది.

తలకుమించిన భారం

సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన నిధులను ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. హాస్టళ్లలోని విద్యార్థులకు భోజనం ఇతర సదుపాయాలకు నిధులు లేకపోవడంతో వార్డెన్లకు తలకుమించిన భారమవుతున్నది. వ్యాపారుల వద్ద అప్పులతో సరుకులు తెచ్చి, హాస్టళ్ల నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిది నెలలుగా బకాయిలు పేరుకోవడంతో వ్యాపారులు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారని పలువురు వార్డెన్లు పేర్కొంటున్నారు. ప్రతీ నెల బిల్లులను విడుదల చేస్తే ఇబ్బందులు ఇండవని, నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని ఆయా వసతి గృహల సంక్షేమాధికారులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు, వార్డెన్లు కుమ్మక్కై సరుకులకు ఎక్కువ ధరలు వేయడం లేదా ఎక్కువ మోతాదులో సరుకులను కొనుగోలు చేసినట్టు పేర్కొని తక్కువ మోతాదులో తీసుకోవడం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సర్కారు నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో సంక్షేమాధికారులు కూడా హాస్టళ్లను తనిఖీలు చేసి మోనూ అమలుపై కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు.

Updated at - Jan 18 , 2024 | 11:53 PM