Share News

GHMC: 18 నుంచి పనులు బంద్‌..!

ABN , Publish Date - May 04 , 2024 | 10:42 AM

పెండింగ్‌ బిల్లులపై కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ(GHMC)కి మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 18వ తేదీలోపు బకాయి బిల్లులన్నీ చెల్లించని పక్షంలో పనులు నిలిపివేయాలని నిర్ణయించారు.

GHMC: 18 నుంచి పనులు బంద్‌..!

- జీహెచ్‌ఎంసీకి కాంట్రాక్టర్ల అల్టిమేటం

- మాన్‌సూన్‌ పనులు చేయొద్దని నిర్ణయం

- రూ.1350 కోట్లు పెండింగ్‌

- చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపణ

హైదరాబాద్‌ సిటీ: పెండింగ్‌ బిల్లులపై కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ(GHMC)కి మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 18వ తేదీలోపు బకాయి బిల్లులన్నీ చెల్లించని పక్షంలో పనులు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బల్దియా కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. వర్షాకాలం పనులు ఎవరూ చేయవద్దని, బిడ్‌లూ దాఖలు చేయొద్దని సూచించారు. ఇందుకు కాంట్రాక్టర్లు అందరూ అంగీకరించారన్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని నెల క్రితం కమిషనర్‌కు లేఖ ఇచ్చామని, గత నెల 18వ తేదీ వరకు మీ చేతిలో ఉన్న అత్యవసర పనులు ఈ నెల 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని అసోసియేషన్‌ కాంట్రాక్టర్లకు సూచించింది. తక్షణ మరమ్మతు బృందాలు (ఐఆర్‌టీ) పనులకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని, వచ్చే వర్షాకాలం పనులకు ఎవరూ బిడ్‌లు దాఖలు చేయవద్దని, బకాయి బిల్లుల కోసం పోరాడుతోన్న సంఘానికి సహకరించాలని కోరారు. ఈ నెల 18వ తేదీ నుంచి స్వచ్ఛందంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మొదలైన హోం ఓటింగ్‌.. మొదటి రోజు నగరంలో ఇంటి వద్దే ఓటేసిన 177 మంది

రూ.1350 కోట్లు పెండింగ్‌...

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న జీహెచ్‌ఎంసీ గత రెండు, మూడేళ్లుగా కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో పెడుతోంది. రహదారుల నిర్మాణం, మరమ్మతు, నాలాల రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, పూడికతీత తదితర పనులకు సంబంధించి దాదాపు రూ.1350 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. వేతనాలు, అప్పులకు వాయిదాల చెల్లింపునకు ఇబ్బంది పడుతోన్న బల్దియా కాంట్రాక్టర్ల బకాయిలను దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన మార్చిలో, ఎర్లీ బర్డ్‌తో ఏప్రిల్‌లో సంస్థకు రూ.1000 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. అయినా బకాయిలు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. గతేడాది మార్చి నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, చేసిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పనులు నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఇదికూడా చదవండి: former CM KCR : తొండి చేసేటోళ్లే ఒట్లు పెట్టుకుంటరు!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 04 , 2024 | 10:42 AM