Share News

Maharashtra: కాంగ్రెస్‌లో పవార్ పార్టీ విలీనం.. సంజయ్ నిరుపమ్ జోస్యం

ABN , Publish Date - May 08 , 2024 | 02:37 PM

మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందని, ఇంతకుమించి పవార్ ఎన్‌సీపీకి మరో మార్గం లేదని ఇటీవలే కాంగ్రెస్ నుంచి ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరిన సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ బుధవారంనాడు జోస్యం చెప్పారు.

Maharashtra: కాంగ్రెస్‌లో పవార్ పార్టీ విలీనం.. సంజయ్ నిరుపమ్ జోస్యం

ముంబై: మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ (Sharad Pawar) సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) త్వరలోనే కాంగ్రెస్ (Congress) పార్టీలో విలీనం కానుందని, ఇంతకుమించి పవార్ ఎన్‌సీపీకి మరో మార్గం లేదని ఇటీవలే కాంగ్రెస్ నుంచి ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరిన సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ (Sanjay Nirupam) బుధవారంనాడు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎన్‌సీపీని విలీనం చేయాలని పవార్ చాలాకాలంగా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సైతం పదేపదే ఈ ప్రతిపాదనను గుర్తు చేసినప్పటికీ పవార్ కుమార్తె కారణంగా అది కార్యాచరణలోకి రాలేదన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకత్వాన్ని తన కుమార్తెకు అప్పగించాలని పవార్ చేసిన సూచనను కాంగ్రెస్ తోసిపుచ్చిందని సంజయ్ నిరుపమ్ వెల్లడించారు.


''ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పవార్ పార్టీ విచ్ఛిన్నమైంది. పవార్ ఇటీవల చేసిన ప్రకటనలు చూస్తుంటే బారామతి నియోజకవర్గం ఆయన కుమార్తె చేతుల్లోంచి జారిపోయే ప్రమాదం ఉందని ఆయన భయపడుతున్నట్టు కనిపిస్తోంది. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం మినహా ఆయనకు మరో మార్గం లేదు'' అని సంజయ్ నిరుపమ్ చెప్పారు. మునిగిపోతున్న పార్టీని పైకి తేల్చే సామర్థ్యం తన కుమార్తెకు లేదని పవార్‌కు బాగా తెలుసుననీ, ఒకవేళ పవార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే, రెండు లాస్ మేకింగ్ కంపెనీలు కలిసినట్టు అవుతుందని, ఫలితం.. పెద్ద సున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.

Haryana: ఇరకాటంలో హరియాణా సర్కార్.. బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందా?


విలీనంపై పవార్ హింట్ ఇచ్చారా?

పవార్ ఇటీవల ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లలో కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం, తమ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలున్నాయని అన్నారు. కాంగ్రెస్‌కు, తమ పార్టీకి మధ్య సైద్ధాంతిక సారూప్యత ఉందని, నెహ్రూ-గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ రెండు పార్టీలు పనిచేస్తుంటాయని చెప్పారు. పవార్ వ్యాఖ్యలతో భవిష్యత్తులో ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయవచ్చనే ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీనిపై పవార్ తిరిగి స్పందిస్తూ, పార్టీ నేతలందరితో చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని వివరణ ఇచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 02:37 PM