Chandrababu: జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కింది: చంద్రబాబు
ABN , Publish Date - Mar 29 , 2024 | 02:00 PM
నంద్యాల: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా , బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు.
నంద్యాల: తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రజాగళం యాత్ర (Prajagalam Yatra)లో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా (Nandyal Dist.), బనగానపల్లె (Banagamapalle)లో ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాగలం సభలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు. కృష్ణా జలాలు రాయలసీమకు అందించిన మహనీయుడు ఎన్టీ రామారావు (NT Ramarao) అని కొనియాడారు. మూడు రాజధానులు చేశానని జగన్ (CM Jagan) నిన్న నంద్యాలలో చెప్పారు.. కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని, జగన్ పాలనలో అందరూ నష్ట పోయారని, పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచే ముఖ్యమంత్రి కావాలా?.. ఫ్యాన్‌ను ముక్కలు వేసి డస్ట్ బిన్‌లో పడేయాలని పిలుపిచ్చారు.
బనగానపల్లె ప్రజలను చూసి ఎండలే భయపడుతున్నాయని, భావి తరాల భవిష్యత్తుకు నాంది పలుకుతానని సభా వేదికగా చంద్రబాబు అన్నారు. కార్మికులకు పనులు దొరకడం లేదు... కార్పొరేషన్‌ల ద్వారా జగన్ ఏ ఒక్కరికీ పైసా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీని చిత్తు చిత్తు చేయాలని శంఖారావం పూరించానన్నారు. కర్నూలు జిల్లాలో తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదని, జగన్ బస్సు యాత్ర తుస్ మందని, జగన్‌ను ఇంటికి పంపడానికి జనం సిద్దంగా ఉన్నారన్నారు.
బాబాయ్ వివేకను చంపి.. చెల్లిని జైలుకు పంపించాలని జగన్ చూస్తున్నారని, బాబాయ్‌ను చంపిన దోషులకు టికెట్ ఇచ్చి వెంట తెచ్చుకుంటున్నారని, చంద్రబాబు విమర్శించారు. అడ్డంగా సంపాదించిన డబ్బును కంటైనర్‌లో తాడేపల్లికి తరలించారని, కంటైనర్‌లలో వంటసామాగ్రి, ఫర్నిచర్ అని వైసీపీ నేతలు అనడం సిగ్గుచేటన్నారు. తనది విజన్ అని... జగన్‌ది పాయిజన్ అని అన్నారు. తంగడంచ, ఓర్వకల్లు, బనవాసిలో అనేక పరిశ్రమలకు శంకుస్థాపన చేశానని.. వాటిని జగన్ ధ్వంసం చేశారన్నారు.
మాదిగలకు న్యాయం చేసే బాధ్యత తనదని, వర్గీకరణకు ఎన్డీయే కూడా ఒప్పుకుందని చంద్రబాబు చెప్పారు. మూడు సిలిండర్లు ఇచ్చి దీపం పథకాన్ని వెలిగిస్తానని, బీసీలకు 50 ఏళ్లకే ఫించను ఇస్తానని స్పష్టం చేశారు. వాలంటీర్ల ఉద్యోగాలకు తనది గ్యారంటీ అని, వేతనాలు కూడా పెంచుతానన్నారు. జగన్ ఐదేళ్లలో రూ. 12 లక్షల కోట్లు అప్పు చేశారని, టీడీపీ మతసామరస్యానికి ప్రతీకని, ప్రతి ఒక్క మైనార్టీకి అండగా ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లెకు పట్టిన శని.. ఆ శనిని వదిలించుకోవాలన్నారు. బ్రహ్మంగారు కాలం జ్ఞానం రాసిన కొండను మింగిన అనకొండ కాటసాని రామిరెడ్డి అని విమర్శించారు. బనగానపల్లెలో నాపరాతి కార్మికులను ఆదుకుంటానని, బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డిని, నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపిచ్చారు.