భువనగిరి మునిసిపల్‌ చైర్మన్‌పై అసమ్మతి రాగం

ABN, Publish Date - Feb 02 , 2023 | 01:01 AM

బీఆర్‌ఎస్‌ పాలక పక్షంగా ఉన్న భువనగిరి మునిసిపాలిటీలో అసమ్మతి పొడసూపింది. చైర్మెన్‌ ఎనబోయిన ఆంజనేయులుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాలకు కొద్ది మంది అసంతృప్త కౌన్సిలర్లు తోడైనట్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

విపక్షాలకు తోడవుతున్న బీఆర్‌ఎస్‌ అసంతృప్త కౌన్సిలర్లు

కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీస్‌ అందించేందుకు యత్నాలు

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 1: బీఆర్‌ఎస్‌ పాలక పక్షంగా ఉన్న భువనగిరి మునిసిపాలిటీలో అసమ్మతి పొడసూపింది. చైర్మెన్‌ ఎనబోయిన ఆంజనేయులుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాలకు కొద్ది మంది అసంతృప్త కౌన్సిలర్లు తోడైనట్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నది. పొరుగునే ఉన్న యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపల్‌ చైర్మన్‌లపై కౌన్సిలర్లు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడంతో భువనగిరి మునిసిపల్‌ చైర్మన్‌పై అసంతృప్తిగా ఉన్న విపక్షాలు, పాలక పక్ష అసంతృప్త కౌన్సిలర్లు కూడా అవిశ్వాసం తీర్మానం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఈ మేరకు గత 2 రోజులుగా పట్టణ శివారులోని ఓ హోటల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో మొదటగా పార్టీల వారీగా, అనంతరం కలిసికట్టుగా సమావేశమై చర్చించి అవిశ్వాస తీర్మానం నోటీస్‌ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు ఈ మేరకు బుధవారం అవిశ్వాస తీర్మానం నోటీ్‌సపై విపక్ష సభ్యులు సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. 35 మంది సభ్యులు గల కౌన్సిల్‌లో ఇద్దరు ఎక్స్‌అఫోషియా సభ్యులు ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డితో కలిపి ఓటు హక్కు కలిగిన వారి సంఖ్య 37కు చేరగా కౌన్సిల్‌లో బీఆర్‌ఎ్‌సకు 20, కాంగ్రె్‌సకు 10, బీజేపీకి 7 సంఖ్యా బలం ఉండగా నోటీ్‌సపై 10 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లకుగాను 8మంది సంతకాలు చేసినట్టు, పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన మరో ఇద్దరు మహిళా కౌన్సిలర్లు కూడా సంతకాలు చేసేందుకు అంగీకరించినట్టు సమాచారం. నోటీసుపై సంతకాలు చేసిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లతోనే ఆ ఇద్దరు మహిళా కౌన్సిలర్ల భర్తలు కలిసి ఉన్నట్లు, బీజేపీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు సంతకాలు చేసినట్టు తెలుస్తున్నది. మునిసిపల్‌ చట్టం 37 ప్రకారం అవిశ్వాస తీర్మాణం నోటీస్‌ ఇచ్చేందుకు కౌన్సిల్‌ ఓటర్ల సంఖ్యలో 50శాతం అనగా 18 మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే కౌన్సిల్‌లో ఓటు హక్కు కలిగిన 37 మంది సభ్యులకు గాను నోటీ్‌సపై విపక్ష సభ్యులు సంతకాలు చేయగా మరో 3, 4 బీఆర్‌ఎస్‌ అసంతృప్త కౌన్సిలర్లు సంతకాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని విపక్షాలు పేర్కొంటున్నాయి. దీంతో నోటీ్‌సపై 20 మందికి పైగా సభ్యులు సంతకాలు చేసి ఒకటి, రెండు రోజుల్లో కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసును అందించేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం అవుతున్నది. అవసరం అయితే నోటీస్‌ అందజేశాక క్యాంపునకు వెళ్లాలని వ్యూహం రూపొందించుకున్నట్లు సమాచారం. అవిశ్వాసం నెగ్గడానికి మాత్రం మూడో వంతు సభ్యులు అనగా 25 మంది సభ్యుల ఆమోదం అవసరం. కాగా అసంతృప్త బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను బుజ్జగించేందుకు ఆ పార్టీ నాయకులు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ బీఆర్‌ఎ్‌సలో అసమ్మతి లేదని, గందరగోళం సృష్టించేందుకే విపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏవీ.కిరణ్‌కుమార్‌, రచ్చ శ్రీనివా్‌సరెడ్డి అంటున్నారు.

Updated at - Mar 05 , 2024 | 09:00 AM