24/7 ఇక షాపులన్నీ ఓపెన్‌!

ABN, First Publish Date - 2023-04-08T03:59:41+05:30 IST

తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక 24 గంటల పాటు దుకాణాలు తెరుచుకోవచ్చు.

తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం

ఏడాదికి అదనంగా రూ.10 వేలు చెల్లిస్తే చాలు

ఉద్యోగులకు సంబంధించి విధిగా రిజిస్టర్‌ పెట్టాలి

కార్మికశాఖ మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక 24 గంటల పాటు దుకాణాలు తెరుచుకోవచ్చు. 24/7 షాపులు ఓపెన్‌ చేసేందుకు అనుమతినిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఏడాదికి రూ.10 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ షాపులు, స్థాపన చట్టం-1988కు ప్రభుత్వం సవరణలు చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని జారీ చేశారు. ‘‘దుకాణాల్లో పని చేసే కార్మికులు, సిబ్బందికి సంబంధించి విధిగా రికార్డులు మెయింటెన్‌ చేయాలి. అలాగే కార్మికులు, సిబ్బందికి ఐడీ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిపై వారి షిఫ్ట్‌ టైమింగ్‌ను కూడా ముద్రించాలి. కార్మిక చట్టాల ప్రకారం పనిగంటలు నిర్ణయించాలి. అదనపు సమయం పనిచేసిన వారికి ఆమేరకు జీతాలు చెల్లించాలి. వీక్లీ ఆఫ్‌లతో పాటు పండుగలకు సెలవులు ఇవ్వాలి. మహిళా కార్మికులు, సిబ్బందికి సంబంధించి వారి అనుమతితోనే నైట్‌ షిఫ్ట్‌లు వేయాలి. అలాగే నైట్‌ షిఫ్టుల్లో పని చేసే మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాలి. వారికి రానుపోను రవాణా సౌకర్యాలు కల్పించాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated at - 2023-04-08T04:00:36+05:30