Share News

BJP: ప్రవాసీయుల మద్దతు కోసం బీజేపీ వినూత్న ప్రచారం.. 'NRI4NAMO' కార్యక్రమం ప్రారంభం

ABN , Publish Date - Apr 18 , 2024 | 07:27 PM

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ(BJP) వినూత్నతకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా సైన్యాన్ని రంగంలోకి దింపిన బీజేపీ.. ఎన్‌ఆర్ఐల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతోంది.

BJP: ప్రవాసీయుల మద్దతు కోసం బీజేపీ వినూత్న ప్రచారం.. 'NRI4NAMO' కార్యక్రమం ప్రారంభం

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ(BJP) వినూత్నతకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా సైన్యాన్ని రంగంలోకి దింపిన బీజేపీ.. ఎన్‌ఆర్ఐల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతోంది. గడిచిన 10 ఏళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధితోపాటు, ఎన్ఆర్ఐల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ.. వారి ఓట్లు కొల్లగొట్టే ప్రణాళికలు రచిస్తోంది.

ఇందులో భాగంగా ఎన్ఆర్ఐలతో బీజేపీని అనుసంధానించడానికి 'NRI4NAMO' కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో ఆ పార్టీ విదేశ్ విభాగం చొరవ తీసుకుంది. ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తదితర సమాచారాన్ని ఇందులో ఇస్తారు. ఎన్ఆర్ఐలను వారి సంబంధిత నియోజకవర్గాలతో కనెక్ట్ చేయడానికి +91 8076707532 (WhatsApp/Mobile) అనే నంబర్ ఇచ్చారు.


ఈ నంబర్ ఎందుకంటే..

2024 సార్వత్రిక ఎన్నికలలో స్వచ్ఛందంగా పాల్గొనాలని అనుకునే NRIలకు కమ్యూనికేషన్‌ని సులభతరం చేయడానికి బీజేపీ 'NRI4NAMO' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసీలను బీజేపీ ప్రచారంతో అనుసంధానం చేయడం, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి సహకారాన్ని ఉపయోగించడం బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది.

బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం చీఫ్ విజయ్ చౌతైవాలే మాట్లాడుతూ.. దేశంలో లోక్ సభ ఎన్నికల ప్రక్రియను గమనించేందుకు ప్రపంచవ్యాప్తంగా 25కిపైగా రాజకీయ పార్టీలకు తాము ఆహ్వానం పంపినట్లు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిందని.. ఆ పార్టీ ఎన్నికల్లో చూపించే ప్రభావంపై ప్రపంచదేశాలకు ఎంతో ఆసక్తి ఉందని అన్నారు. విదేశీ పార్టీలకు ఇక్కడ ఎన్నికలు జరిగే విధానంపై ఆసక్తి ఉంటుందని అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు.

21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17) ముగిసింది. ఈ స్థానాల్లో ఏప్రిల్ 19 (శుక్రవారం) మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. 18వ లోక్‌సభలోని 543 మంది సభ్యుల భవితవ్యాలను ప్రజలు తేల్చనున్నారు. ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.

AC Helmet: ట్రాఫిక్ పోలీసుల సమ్మర్ కష్టాలకు చెక్.. భలేగా ఏసీ హెల్మెట్.. విశేషాలివే


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 07:28 PM