బొజ్జ గణపయ్యకు ఇష్టమైన  పిండి తాళికల పాశం.. ఇలా ట్రై చేయండి

బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా ఎన్ని రకాల పిండి వంటలు పెట్టినా, పాయసం లేని పూజ అసంపూర్తిగా అనిపిస్తుంది.

కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు,బెల్లం తురుము: 1½ కప్పులు,సగ్గుబియ్యం: ¼ కప్పు, పాలు: 4 కప్పులు,గసగసాలు: 2 టేబుల్ స్పూన్లు,యాలకుల పొడి: ½ టీస్పూన్,నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు,డ్రై ఫ్రూట్స్

ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా నీరు, చిటికెడు ఉప్పు వేసి చపాతీ పిండిలా గట్టిగా కలపండి.

 ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను సన్నగా, పొడవుగా తాళికలు చుట్టండి. ఈ తాళికలను ప్లేట్‌లో ఉంచి ఆరనివ్వండి.

  సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టండి. గసగసాలను కూడా వేడి నీటిలో పది నిమిషాలు నానబెట్టి మెత్తని పేస్ట్ లాగా రుబ్బండి.

  ఒక పాత్రలో పాలు తీసుకుని పొంగు వచ్చే వరకు మరిగించండి. పాలు మరిగాక, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి, అవి మెత్తగా ఉడికే వరకు కలపండి.

  తాళికలను ఒక్కొక్కటిగా పాలల్లో వేయండి. మంటను తక్కువ చేసి, తాళికలు పూర్తిగా ఉడికి మెత్తగా అయ్యే వరకు ఉంచండి. ఈ సమయంలో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి.

 తాళికలు పూర్తిగా ఉడికిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, బెల్లం తురుము, గసగసాల పేస్ట్ వేసి బాగా కలపండి.

 ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేడి చేసి, అందులో జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేయించి, నెయ్యితో సహా పాయసంలో కలపండి.

చివరిగా యాలకుల పొడి వేసి కలిపి పాయసాన్ని సర్వ్ చేయండి. వినాయక చవితికి గణపతికి నైవేద్యంగా పెట్టడానికి ఇది చాలా మంచి వంటకం.