సరదాల సంక్రాంతి వచ్చేసింది. రంగు రంగుల ముగ్గులు, గుమగమలాడే పిండి వంటలతో తెలుగు రాష్ట్రాల్లో పండగ సందడి మొదలైంది.
సంక్రాంతి సమయంలో పాటించే ప్రతి ఆచారం వెనక ప్రత్యేక నమ్మకం, చరిత్ర ఉంటాయి. వీటితో పాటు గాలిపటాలు ఎగురవేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
చిన్నా, పెద్దా తేడా మరిచిపోయి ప్రతిఒక్కరూ గాలిపటాలు ఎగరేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి.
ఇలా ఎందుకు చేస్తారంటే.. సాధారణంగా చలికాలంలో క్రిములు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండటం వల్ల ఎండ పొడ తగలక జలుబు, జ్వరం వస్తుంటాయి.
లేలేత సూర్యకిరణాలు శరీరాన్ని తాకితే డి- విటమిన్ ఉత్పత్తి అయ్యి సహజంగానే బ్యాక్టీరియా నశిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
అందుకే పతంగులు ఎగరేయాలని ఆచారం మొదలైందని అంటారు. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మకర సంక్రాంతి, ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగరేస్తే స్వర్గానికి వెళ్తారని నమ్మకం ఉంది.
మంచి జీవితాన్ని, సంతోషాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాలిపటం ఎగురవేస్తారట. అలాగే ఉత్తరాయణ సమయంలో నీలాకాశంలో గాలిపటం ఎగరేయడం వలన మనసుకు హాయిగా ఉంటుందని కొందరు చెబుతారు.