బెల్లంను మనం తరచూ అనేక వంటకాల తయారీలో ఉపయోగిస్తాం. బెల్లంతో తీపి వంటకాలను ఎక్కువగా చేస్తుంటారు.
ఆయుర్వేద ప్రకారం బెల్లం మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి.
చలికాలంలో రోజూ కచ్చితంగా చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
బెల్లం శరీరానికి వేడి చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ప్రత్యేకించి ఈ కాలంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
చలికాలంలో శరీర మెటబాలిజం తగ్గుతుంది. కానీ బెల్లంను తింటే మెటబాలిజంను పెంచుకోవచ్చు. దీని వల్ల క్యాలరీలు సులభంగా ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
ఇక చలికాలంలో మన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు బెల్లంను తింటే ఉపయోగం ఉంటుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి.
దీని వల్ల శరీరం వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇలా చలికాలంలో బెల్లంను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.