చెరకు రసం ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ,బీ,సీ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇన్ని లాభాలున్నప్పటికీ ఈ రసాన్ని కొంత మంది తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చెరకు రసం సహజమైనది. అందులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారవచ్చు.
ఒక్క గ్లాసు చెరకు రసంలో సుమారు 40 నుంచి 50 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉండే చక్కెరతో సమానం. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఈ రసానికి దూరంగా ఉండాలి.
రోడ్డు పక్కన విక్రయించే చెరకు రసం పరిశుభ్రంగా ఉండకపోవచ్చు. మురికి నీరు లేదా కలుషితమైన ఐస్ వాడడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఇలాంటి చెరుకు రసం తాగితే వృద్ధులు, పిల్లలు అనారోగ్యానికి గురయే అవకాశాలున్నాయి.
కాలేయానికి చెరకు రసం మంచిదని చెబుతారు. కానీ కొవ్వు కాలేయం లేదా సిర్రోసిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది హానికరంగా మారవచ్చు.
చెరకు రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగి, పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు.
చెరకు రసం అధిక తీపి ఉంటుంది. ఇది తాగితే దంతాలకు అతుక్కుంటుంది. ఇది బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. అంటే దంతాలు పుచ్చిపోవడం లేదా చిగుళ్ల సమస్యలకు దారి తీయవచ్చు.
ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే.. చెరకు రసం తాగిన వెంటనే నీటితో పుక్కిలించడం లేదా పళ్ళు తోముకోవడం చేయాలి.
జీర్ణక్రియలో ఇబ్బందులు, గ్యాస్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు చెరకు రసాన్ని అధికంగా తాగకూడదు. ఇందులో ఉండే చక్కెరలు కడుపులో త్వరగా పులిసిపోయి, గ్యాస్ లేదా తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
మధుమేహం, ఊబకాయం లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రసం తాగకుండా ఉండటం ఉత్తమం.