ఆయుర్వేదంలో శొంఠి పొడి (ఎండిన అల్లం పొడి)ని అనేక రోగ చికిత్సల నివారణకు ఉపయోగిస్తారు.
జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు వంటి వాటికి సమస్యలకు ఇంటి చిట్కాగా వీటిని వినియోగిస్తారు.
శొంఠి పొడిలో జింజెరోల్స్, షాగోల్స్ ఉంటాయి. ఇవి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
ఇది జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచి.. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఉదయం గోరు వెచ్చని నీటిలో శొంఠి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే పలు సమస్యలు తగ్గుతాయి.
వీటిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో దీనిని వాడడం మంచిది.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వేడి పాలల్లో శొంఠి పొడి కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
శొంఠిలో సహజ సిద్ధ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇది కీళ్ల, కండరాల నొప్పులు, వాపులు తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ తదితర సమస్యలకు చక్కటి ఉపశమనం ఇది.
మార్నింగ్, మోషన్ సిక్‌నెస్‌లకు లేదా కీమోథెరపీ కారణంగా వచ్చే వికారం, వాంతులను తగ్గించడంలో శొంఠి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
ఇది జీవక్రియ రేటు (మెటబాలిజం) పెంచి, శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఇది ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడంలో దోహదపడుతుంది. గోరు వెచ్చని నీటిలో శొంఠి పొడి కలిపి తాగడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో శొంఠి సహాయపడుతుంది, తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం.. శొంఠి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది డయాబెటిస్ ఉన్న వారికి లేదా ప్రీ డయాబెటిస్ ఉన్న వారికి ప్రయోజనకారిగా పని చేస్తుంది.
శొంఠి స్వభావ రీత్యా వేడిని పుట్టిస్తుంది. కాబట్టి చలికాలంలో లేదా శరీరంలో చల్లదనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.