సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?

సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. ఆయనకు సాంప్రదాయ యోగాలో ప్రత్యేక స్థానం ఉంది.

ప్రతి రోజూ కొన్ని నిమిషాలపాటు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరం శక్తివంతమవుతుంది. మానసిక బలం వృద్ధి చెందుతుంది.

సాంప్రదాయ యోగా పద్ధతుల్లో సూర్య నమస్కారాలు చాలా శక్తివంతమైనవి. 12 రకాల భంగిమలతో కూడిన ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం లభిస్తుంది. ఈ యోగాలో ప్రతి భంగిమ కండరాలను బలంగా చేస్తుంది. ఇవి రోజూ చేస్తే శరీరం దృఢంగా మారుతుంది.

కొన్ని భంగిమలు ప్రేగులు, కాలేయం, కడుపు వంటి అవయవాలపై ఒత్తిడిని కలిగించి అవి బాగా పనిచేసేలా చేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను సైతం తగ్గిస్తుంది.

రోజూ సూర్య నమస్కారం చేస్తే.. నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది. మంచి నిద్ర వల్ల శరీరం మరింత ఆరోగ్యంగా మారుతుంది.

ఈ యోగా ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి రక్తం చేరుతుంది. చర్మానికి తగినంత ఆక్సిజన్ అందడంతో అది కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.

సూర్య నమస్కారాన్ని వేగంగా చేస్తే శరీరం అధిక శక్తిని వాడుకుంటుంది. దీని వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.

ఈ యోగాలో శ్వాస పద్ధతికి ప్రాధాన్యత ఉంటుంది. ఊపిరి పీల్చడం, వదలడం వంటి ప్రక్రియలతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. ఇది ఒక రకంగా ధ్యానంలా పనిచేస్తుంది.

వీటిని రోజూ చేయడం వల్ల శరీరంలోని అవయవాల పనితీరు మెరుగవుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

ఈ యోగా చేసేటప్పుడు శ్వాస తీసుకునే ప్రక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం తేలికగా, శక్తివంతంగా అనిపిస్తుంది.

సూర్య నమస్కారం కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య సాధన అని పెద్దలు చెబుతారు.