సమస్యలు.. చర్చించేనా?

ABN , First Publish Date - 2022-07-30T04:46:24+05:30 IST

అధ్వానంగా ఉన్న రహదారులు, మరో వైపున నిధుల కొరత, క్రమంగా తగ్గిపోతున్న ఆదాయ వనరులు, ఖరీఫ్‌లో రైతుల సమస్యలు, పనులు పూర్తయినా వైసీపీ కాంట్రాక్టర్లకు అందని బిల్లులు.. ఇంకా పలు సమస్యలు జిల్లాలో తాండవిస్తున్నాయి.

సమస్యలు.. చర్చించేనా?
జడ్పీ కార్యాలయం

జడ్పీలో నిధుల కొరత

తగ్గిపోతున్న ఆదాయ వనరులు 

జిల్లాలో అస్తవ్యస్తంగా రహదారులు

చేసిన పనులకు కాంట్రాక్టర్లకు అందని బిల్లులు

నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

 (గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

అధ్వానంగా ఉన్న రహదారులు, మరో వైపున నిధుల కొరత, క్రమంగా తగ్గిపోతున్న ఆదాయ వనరులు, ఖరీఫ్‌లో రైతుల సమస్యలు, పనులు పూర్తయినా వైసీపీ కాంట్రాక్టర్లకు అందని బిల్లులు.. ఇంకా పలు సమస్యలు జిల్లాలో తాండవిస్తున్నాయి. నేడు(శనివారం) జడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేథప్యంలో ఈ సమస్యలు చర్చకు వచ్చేనా..? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఖరీఫ్‌లో పుష్కలంగా వర్షాలు కురిశాయి. రైతులకు అవసరమైన విత్తనాలు ఆర్బీకేలలో అందుబాటులో లేవు. బ్యాంకుల్లో కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు చొరవ చూపడం లేదు. కొత్త తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సహకార సంస్థలు ఉద్యోగుల చేతివాటంతో బోగస్‌ రుణాలకు కేంద్రాలయ్యాయి.  జడ్పీలో గతంలో సుమారు రూ.20 కోట్లున్న ఆదాయం ప్రస్తుతం రూ.10 కోట్లకు పడిపోయింది. ఇసుక, పడవలు, బల్లకట్టుల వేలం నిలిచిపోయింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ల అద్దెలు వసూలు కావటంలేదు. జడ్పీ భూముల కౌళ్లు పెరగకపోగా ఏటా తగ్గిపోతున్నాయి. అతిథి గృహాలకు ఆదాయం రాకపోగా విద్యుత్‌ బిల్లులు, సిబ్బంది జీతాలు జడ్పీ నుంచే చెల్లించాల్సి వస్తోంది. గ్రామాల్లో వైసీపీ ద్వితీయశ్రేణి కార్యకర్తలు, నేతలు చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు రాలేదు. సచివాలయాలు, ఆర్బీకేలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హెల్త్‌క్లినిక్‌ నిర్మాణాలు తదితర పనులు చేశారు. ఉపాధి హామీకి అనుసంధానంగా వీటిని చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.వందకోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. పనులు పూర్తిచేసిన కార్యకర్తలు తమ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని పలువురు జడ్పీటీసీలు ఇటీవల జరిగిన స్టాండింగ్‌కమిటీ సమావేశాల్లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపున జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో కొన్నిప్రాంతాల్లో అనుమతిలేని లేఅవుట్‌లు విచ్చలవిడిగా వస్తున్నాయి. జడ్పీలో షాడో ప్రమేయం క్రమంగా పెరుగుతోంది. బదిల్లోనూ వీరి ప్రమేయం ఉంటోందని విమర్శలు వస్తున్నాయి.  మీటింగ్‌హాల్‌లో జరిగే వివిధ సమావేశాలకు షాడో హాజరవుతున్నారు.  

నేడు సర్వసభ్య సమావేశం..

జడ్పీ కార్యాలయంలో ఈనెల 30న చైర్‌పర్సన్‌ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరుగనుంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ  సమావేశంలో పాల్గొంటారు. 


Updated Date - 2022-07-30T04:46:24+05:30 IST