డిప్యూటేషన్లపైనే ఆసక్తి

ABN , First Publish Date - 2021-08-12T05:45:41+05:30 IST

అసలు చేయాల్సిన పని ముఖ్యం కాదన్నట్లుగా కొందరు ఉద్యోగులు డిప్యూటేషన్లపై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

డిప్యూటేషన్లపైనే ఆసక్తి
జిల్లా పరిషత్‌ కార్యాలయం

విచ్చలవిడిగా నియామకాలు 

ఇప్పటివరకు 20 మంది వరకు పోస్టింగ్‌

జడ్పీ, మండల పరిషత్‌ల్లో ఆ మేరకు సీట్లు ఖాళీ

సీసీలుగా వెళ్లేందుకు అసక్తి చూపుతోన్న ఉద్యోగులు

మిగిలిన ఉద్యోగులపై పెరిగిపోతోన్న పనిభారం 


గుంటూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): అసలు చేయాల్సిన పని ముఖ్యం కాదన్నట్లుగా కొందరు ఉద్యోగులు డిప్యూటేషన్లపై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేదో పనిలేని శాఖల్లో అయితే పర్వాలేదు. కీలకమైన పంచాయతీరాజ్‌లోని ఉద్యోగులు డిప్యూటేషన్లపై వెళ్లడమే కాకుండా పొడిగించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థలకు వెన్నెముక లాంటి పంచాయతీరాజ్‌ జిల్లా శాఖ ఉద్యోగుల కొరతతో బలహీనపడుతున్నది. ఇక్కడ కొలువైన ఉద్యోగులు డిప్యూటేషన్‌పై వేరే శాఖలకు వెళ్లిపోతున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల వద్ద సీసీలుగా పని చేసేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఈ విధంగా సుమారు 20 మంది వరకు డిప్యూటేషన్‌పై వెళ్లినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో 57 మండలాలను పర్యవేక్షించే వివిధ విభాగాలపై పని ఒత్తిడి పెరుగుతున్నది. ఒకసారి డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులు అలానే పొడిగించుకుంటున్నారు తప్ప వెనక్కు రావడానికి ఇష్టపడటం లేదు. ఈ విధమైన డిప్యూటేషన్‌లు గతంలో ఎప్పుడూ జరగలేదని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని 57 మండల పరిషత్‌లను పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షిస్తుంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను ఆయా మండలపరిషత్‌ల ద్వారానే అమలు చేస్తుంటుంది. దీంతో పంచాయతీరాజ్‌ శాఖలోని వివిధ విభాగాల్లో ప్రతీ సీటు ఉద్యోగి క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆయా మండలాల అధికారులకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు పంపడం, తగిన సమాచారం తెప్పించుకోవడం వంటివి చేయాలి. అలానే ఉద్యోగుల సర్వీసు వివరాలు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటి పనిభారం తోటి ఉద్యోగులపై పడేసి కొంతమంది ఉద్యోగులు డిప్యూటేషన్‌ చేయించుకుంటున్నారు.


గతానికి భిన్నంగా..

గతంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌-1, 2 పోస్టులు మాత్రమే ఉండేవి. వారికి మాత్రమే సీసీలు ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ(రెవెన్యూ), జేసీ(సచివాలయాలు), జేసీ(హౌసింగ్‌), జేసీ(ఆసర) పోస్టులను ఏర్పాటు చేసింది. దీంతో అదనంగా ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు వచ్చారు. వీరితో పాటు ట్రైనీ కలెక్టర్‌ ఒకరు ఉన్నారు. అలానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ వద్ద సీసీలుగా పంచాయతీరాజ్‌ ఉద్యోగులే కావాలని లేఖలు ఇచ్చి మరీ డిప్యూటేషన్‌పై పోస్టింగ్‌ చేయించుకున్నారు. గతంలో ఓ సీసీ వైసీపీ ఎమ్మెల్యే వెంట ఎన్నికల సమయంలో సంచరిస్తూ ఓ అభ్యర్థిని బలవంతంగా తీసుకొచ్చి నామినేషన్‌ని ఉపసంహరించారు. ఈ సంఘటనపై అప్పట్లో ఎన్నికల సంఘం కూడా సీరియస్‌ అయింది. సహజంగా ఏదైనా ప్రభుత్వ శాఖలో పని ఒత్తిడి తక్కువగా ఉంటే అలాంటి డిపార్టుమెంట్ల నుంచి సీసీలను నియమించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే జిల్లాలో అందుకు విరుద్ధంగా కీలకమైన పంచాయతీరాజ్‌ శాఖ నుంచి ఉద్యోగులను సీసీలుగా నియమించుకుంటోండటంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇదిలావుంటే సీసీలుగా వచ్చిన వారు ఉన్నతాధికారుల పక్కన ఉంటూ కొన్నాళ్లకు తాము కూడా ఆ స్థాయి అన్న దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ మాతృ శాఖకు చెందిన పై అధికారులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఏకవచనంతో సంభోదిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 



Updated Date - 2021-08-12T05:45:41+05:30 IST