రెవెన్యూ సమస్యలపై దద్దరిల్లిన మండల సమావేశం

ABN , First Publish Date - 2022-01-21T05:06:43+05:30 IST

రెవెన్యూ సమస్యలపై గుమ్మడిదల మండల సర్వసభ్య సమావేశం దద్దరిల్లింది.

రెవెన్యూ సమస్యలపై దద్దరిల్లిన మండల సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ, జడ్పీటీసీలు

గుమ్మడిదల, జనవరి 20 : రెవెన్యూ సమస్యలపై గుమ్మడిదల మండల సర్వసభ్య సమావేశం దద్దరిల్లింది. ఎన్నోఏళ్లుగా రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రైతువేదిక భవనంలో ఎంపీపీ సద్ది ప్రవీణావిజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అన్ని గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీటీసీలు, సర్పంచులు మండిపడ్డారు. దీంతో తహసీల్దార్‌ సుజాత మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ పోతున్నామని తెలిపారు. మరికొన్ని సమస్యలను అధికారుల ఆదేశాల మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా నూతన మండల ప్రభుత్వ కార్యాలయం నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరామని, కానీ ఇప్పటివరకూ స్థలం మంజూరు కాలేదని చెప్పారు. స్థలం మంజూరు చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌ సమావేశంలో వెల్లడించారు. పారిశ్రామికవాడలో కొన్ని పరిశ్రమలు విచ్చలవిడిగా రసాయనాలను బయటకు వదులుతూ చెరువులు, కుంటలను కాలుష్యంగా మారుస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని దోమడుగు సర్పంచ్‌ రాజశేఖర్‌ వివరించారు. మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి పూర్తిస్థాయిలో అధికారులు రాకపోవడం పట్ల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ సద్ది ప్రవీణావిజయభాస్కర్‌ మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించే దిశగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షురాలు మంజులావెంకటేశ్‌గౌడ్‌, ఎంపీడీవో చంద్రశేఖర్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:06:43+05:30 IST