ఉక్రెయిన్ అధ్యక్షుడికి రష్యాలో వేల మంది ఫ్యాన్స్!

ABN , First Publish Date - 2022-02-26T00:13:07+05:30 IST

రష్యా దాడులతో ఉక్రెయిన్ పరిస్థితి దయనీయంగా మారింది. రష్యా సేనలను సొంతంగా ఎదుర్కొనే సామర్థ్యం లేక అమెరికాతో సహా నాటో(NATO) దేశాల సాయం అందక.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడికి రష్యాలో వేల మంది ఫ్యాన్స్!

ఇంటర్నెట్ డెస్క్: రష్యా దాడులతో ఉక్రెయిన్ పరిస్థితి దయనీయంగా మారింది. రష్యా సేనలను సొంతంగా ఎదుర్కొనే సామర్థ్యం లేక అమెరికాతో సహా నాటో(NATO) దేశాల సాయం అందక.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. సాయం చేయాలంటూ అమెరికా, నాటో, ఈయూ దేశాలను వేడుకుంటున్నారు. అత్యంత శక్తివంతమైన దేశం దూరంగా నిలబడి చూస్తోందంటూ అమెరికాను ఉద్దేశించి ఆయన తాజాగా చేసిన కామెంట్ ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితికి అద్దం పడుతోంది. రష్యా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుందంటూ సాయం కోసం అర్థిస్తున్నారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ.. ఒకప్పుడు కమెడియన్‌గా తన కెరీర్‌ను  ప్రారంభించారు. ఉక్రెయిన్‌లోనే కాకుండా రష్యాలోనూ వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు.  


అధ్యక్షుడు కాక మునుపు జెలెన్‌స్కీ ఓ కమెడియన్.  ఆయన నటించిన ఓ టీవీ సీరియల్ అత్యంత ప్రజాదరణ పొందింది. యాధృచ్ఛికంగా ఓ దేశానికి పాలకుడైన వ్యక్తి పాత్రలో జెలెన్‌స్కీ నటన ఆయనకు అనేక మంది అభిమానుల్ని సంపాదించింది.  ఆ తరువాత ఆయన అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డారు. అనేక వాగ్దానాలను చేశారు. రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని చెప్పడమే కాకుండా, కేవలం ఒక పర్యాయమే అధ్యక్ష పదివిలో కొనసాగుతానని కూడా ప్రజలకు బాస చేశారు. చర్చల ద్వారా రష్యాతో విభేదాల్ని తొలగిస్తానంటూ ప్రజలకు మాటిచ్చారు జెలెన్‌స్కీ. ఊహాజనిత లోకంలో అధ్యక్షుడిగా అద్భుతాలు సృష్టించిన ఆయన నిజజీవితంలో అందులో కొంతైనా చేయకపోతారా అనుకుంటూ ప్రజలు ఆయనకు 2019లో దేశ పగ్గాలను అప్పగించారు. కానీ ప్రస్థుత పరిస్థితులు ఆయన గతంలో ఎన్నడూ ఊహించని విధంగా మారిపోయాయి.  ప్రస్తుతం.. రష్యా సేనలు దేశంలోకి అన్ని వైపుల నుంచీ దూసుకొస్తుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూరుకుపోయారు జెలెన్‌స్కీ. తాను ఆశించిన స్థాయిలో అమెరికా, నాటో దేశాల సాయం అందక విలవిల్లాడుతున్నారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ అనేక మంది రష్యన్లు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తాము రష్యన్లు అయినందుకు విచారపడుతున్నామని కొందరు, పుతిన్ నిర్ణయాలు రష్యా ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించవంటూ మరికొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2022-02-26T00:13:07+05:30 IST