జహీరాబాద్‌లో ఇప్పట్లో లేనట్టే?

ABN , First Publish Date - 2021-04-16T05:36:19+05:30 IST

గతేడాది జనవరిలో జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికలు జహీరాబాద్‌లో మాత్రం నిర్వహించలేదు. నాడు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే గురువారం వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూర్‌, జడ్చర్ల మున్సిపాలిటీలకు ఈ నెలాఖరులోపు ఎన్నికలను పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే జహీరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ప్రజలు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు.

జహీరాబాద్‌లో ఇప్పట్లో లేనట్టే?
జహీరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం

రాష్ట్రమంతటా మున్సిపల్‌ ఎన్నికల వేడి

జహీరాబాద్‌లో మాత్రం వాయిదా

న్యాయస్థానం పరిధిలో విలీన గ్రామాల పంచాయితీ

ఎన్నికల ప్రకటన కోసం నేతల ఎదురుచూపులు 


జహీరాబాద్‌, ఏప్రిల్‌ 15 : గతేడాది జనవరిలో జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికలు జహీరాబాద్‌లో మాత్రం నిర్వహించలేదు. నాడు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే గురువారం వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూర్‌, జడ్చర్ల మున్సిపాలిటీలకు ఈ నెలాఖరులోపు ఎన్నికలను పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే జహీరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ప్రజలు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే జహీరాబాద్‌ మున్సిపల్‌ సమస్య న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఎవరు ఏమిచేయలేని పరిస్థితి నెలకొన్నది. నాలుగేళ్ల్ల క్రితం జహీరాబాద్‌ మున్సిపాటికి మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను విలీనం చేశారు. జహీరాబాద్‌ సమీపంలోని పస్తాపూర్‌, అల్లీపూర్‌, చిన్నహైదరాబాద్‌, రంజోల్‌, హోతి(కే) గ్రామాలను  అధికారులు విలీనం చేశారు. 1953లో ఏర్పాటైన జహీరాబాద్‌ మున్సిపాలిటీలో 24 వార్డులు, 35 వేల పైచిలుకు ఓటర్లు ఉండగా గ్రామాల విలీనంతో అదనంగా 13 వార్డులు పెరిగాయి. దీంతో జహీరాబాద్‌ మున్సిపాలిటీ ఓటర్ల సంఖ్య 65,378కు పెరగడంతో పాటు వార్డుల సంఖ్య 37కు చేరుకున్నది. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం హోతి(కే) గ్రామానికి చెందిన కొందరు స్థానికులు తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం పరిధిలో విలీన సమస్య ఉన్నందున ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు జహీరాబాద్‌ మున్సిపాలిటీకి జరగాల్సిన ఎన్నికను వాయిదా వేశారు. జహీరాబాద్‌ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు 2018 సంవత్సరంతో ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో కొనసాగుతున్నారు. పాలకవర్గం లేకపోవడంతో మున్సిపాలిటీకి నిధుల విషయంలో గట్టిగా అడిగే నాయకుడు లేక అభివృద్ధి కుంటుపడింది. వార్డుల పరిధుల్లో సమస్య ఏదైనా కౌన్సిలర్లు ఉంటేనే పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తున్నారు. ఎప్పుడు  ఎన్నికలు నిర్వహిస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉండగా న్యాయస్థానం అడిగిన ప్రతి వివరాలను మున్సిపల్‌ అధికారులు అందజేసినట్లు తెలిసింది. ఐతే ఎన్నికలను మాత్రం హోతి(కే) గ్రామాన్ని వదిలి నిర్వహిస్తారా, లేక ఐదు విలీన గ్రామాలను కలిపి నిర్వహిస్తారా అనే విషయం సందిగ్ధంగా మారింది. గతంలో మున్సిపల్‌ అధికారులు విలీన గ్రామాలను కలిపి మున్సిపాలిటీలో వార్డుల వారీగా జనాభా, ఓటర్ల గణనతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. హోతి(కే) గ్రామాన్ని వదిలేస్తే మళ్లీ జనాభా, ఓటర్ల గణనతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 


Updated Date - 2021-04-16T05:36:19+05:30 IST