జడ్పీ గరం గరం

ABN , First Publish Date - 2021-07-26T07:06:10+05:30 IST

సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జడ్పీ గరం గరం
జిల్లా పరిషత్‌ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

అధికారులను నిలదీసిన సభ్యులు

ట్రాన్స్‌కో అధికారులపై మంత్రి జగదీ్‌షరెడ్డి ఆగ్రహం


యాదాద్రి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మంత్రి జగదీ్‌షరెడ్డి హాజరుకాగా, పలు శాఖలపై వాడీవేడిగా చర్చ కొనసాగింది. నిధుల్లేక ఉత్సవ విగ్రహాలుగా మిగులుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మొక్కలు నాటడం, పారిశుధ్య పనులకే పరిమితం అవుతున్నామని అన్నారు. స్మార్ట్‌ఫోన్లు, టీవీ లేని విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కొవిడ్‌ రెండో డోస్‌ టీకాలో జాప్యం చోటుచేసుకుంటోందని, వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలని కోరారు. పల్లె ప్రకృతివనం కోసం సంస్థాన్‌నారాయణపూర్‌ ఆస్పత్రి ప్రహరీ ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. చౌటుప్పల్‌ పీహెచ్‌సీ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, 100పడకలు ఏర్పాటుచేస్తారా లేదా అనేది స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. భువనగిరిలో థైరాయిడ్‌ పరీక్షలు చేయడంలేదని, అడ్డగూడూరు ఏరియా ఆస్పత్రిలో 24గంటల వైద్యం అందడంలేదని తెలిపారు. రైతుబీమా పథకం కింద రైతులకు సకాలంలో పరిహారం అందడంలేదని తుంగుతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అధికారుల దృష్టికి తెచ్చారు. దరఖాస్తులను వెంటనే ప్రభుత్వానికి పంపాలని మంత్రి జగదీ్‌షరెడ్డి సూచించారు. 


విద్యుత్‌ అధికారులపై ఆగ్రహం

ప్రజాప్రతినిధులను విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయడంలేదని మంత్రి జగదీ్‌షరెడ్డికి ఫిర్యాదు చేశారు. వడాయిగూడెంలో విద్యుత్‌ తీగలు తెగి ఓ రైతుకు చెందిన 40గొర్రెలు మృతి చెందాయని, అతడికి పరిహారం చెల్లించాలని కోరారు. గుండాల మండలంలో రైతులు విద్యుత్‌ కనెక్షన్ల కోసం డీడీ తీసినా అధికారులు స్పందించడంలేదన్నారు. దీంతో ట్రాన్స్‌కో అధికారులపై మంత్రి జగదీ్‌షరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలపై శ్రద్ధవహించాలని ఆదేశించారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు పూర్తి చేయాలని సూచించారు. మూసీకి భారీగా వరద వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇరిగేషన్‌ శాఖతో పరేషాన్‌

జిల్లాకు ప్రత్యేకంగా ఇరిగేషన్‌ అధికారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. బునాదిగాని కాల్వ ఆధునికీకరణ కోసం వెంటనే భూసేకరణ చేపట్టాలని, రైతులకు పరిహారం చెల్లించాలని, నోటిఫికేషన్‌ లేని రైతులకు రైతుబంధు వర్తింపజేయాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు కిషోర్‌, చిరుమర్తి లింగయ్య కోరారు. ధర్మారెడ్డి కాల్వ ఆధునీకరణకు రూ.1.80కోట్లు మంజూరయ్యాయని, దీనికి సంబంధించి అధికారుల వద్ద సరైన సమాచారం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి మండలం వడపర్తిలో కల్వర్టు ఎత్తులేకపోవడంతో నీరంతా వృథాగా పోతోందని ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి తెలిపారు. మంత్రి స్పందిస్తూ పూర్తివివరాలు సేకరించి, వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గంధమల్ల ప్రాజెక్టు అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.


రోడ్ల మరమ్మతులకు దిక్కులేదు

గ్రామీణ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చారు. రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని, పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా రోడ్ల పనులకు రూ.17కోట్ల మేరకు ప్రతిపాదనలు పంపామని, మంజూరు కాగానే పనులు చేపడుతామని పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ తెలిపారు. కాగా, జడ్పీ సమావేశంలో మైకులు మొరాయించడంతో ప్రజాప్రతినిధులు అసౌకర్యానికి గురయ్యారు. కాగా, సమావేశంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ డి.బీకూనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T07:06:10+05:30 IST