పెళ్లికానుక..ఆశలు.. ఆవిరి

ABN , First Publish Date - 2022-07-03T04:47:18+05:30 IST

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి పేదింటి పెళ్లి తానే చేస్తానని వాగ్దానం చేశారు. ఆ మేరకు చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని 2018లో అమలులోకి తెచ్చారు.

పెళ్లికానుక..ఆశలు.. ఆవిరి

మూడేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు 

చంద్రబాబు హయాంలో ఆడబిడ్డల పెళ్లికి భరోసా

అధికారంలోకి రాగానే కానుక పెంచి ఇస్తానంటూ జగన్‌ ప్రకటన 

ఇప్పటికీ ఏ ఒక్కరికీ అందని పథకం లబ్ధి

ఉమ్మడి జిల్లాలో సుమారు 35 వేల మందికి టోకరా

 అసలీ పథకం ఉనికిలో ఉందో లేదో తెలియని పరిస్థితి


ఒక ఊరి పెద్ద పెళ్లికి వెళ్లి వెయ్యి రూపాయలు కానుక ఇచ్చాడు. అది తెలిసి మరో పెద్ద మనిషి ఇక నుంచి తన తండ్రి పేరుతో అంతకంటే ఎక్కువ కానుక ఇస్తానని ప్రకటించాడు. ఊరూరా తిరిగి కనిపించినవారికల్లా చెప్పాడు. అందరూ ఆహా ఓహో అన్నారు. అందరూ ఆయన్ని కాదని ఈయనకు జై కొట్టారు. తీరా చూస్తే ఈయన ఈరోజు వరకూ ఒక్కరంటే ఒక్కరికి కూడా పెళ్లి కానుక ఇవ్వలేదు. - అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదే నేడు రాష్ట్రంలో వైఎస్సార్‌ పెళ్లి కానుక పరిస్థితి. అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో కంటే ఘనమైన కానుక ఇస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. అయితే ఇది ప్రకటనలకు పరిమితం అయింది. ఈ నగదుపై ఆధారపడి పెళ్లి చేసిన కొన్ని వేల కుటుంబాలు నేడో, రేపో వస్తాయన్న ఆశతో మూడేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరికీ పెళ్లి కానుక దక్కిన దాఖలాలు కనిపించడం లేదు. 

 

గుంటూరు, జూలై2(ఆంధ్రజ్యోతి): చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి పేదింటి పెళ్లి తానే చేస్తానని వాగ్దానం చేశారు. ఆ మేరకు చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని 2018లో అమలులోకి తెచ్చారు. దివ్యాంగుల వివాహానికి రూ.లక్ష, ఎస్సీ ఎస్టీ కులాంతర వివాహాలకు రూ.75వేలు, బీసీ కులాంతర వివాహాలకు రూ.50 వేలు, గిరిపుత్రికా కల్యాణ యోజన కింద ఎస్టీలకు రూ.50 వేలు, దుల్హన్‌ పథకం కింద ముస్లిం మైనారిటీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేలు చొప్పున పెళ్లికానుక ప్రకటించి పేదింటి పెళ్లి బాధ్యత తీసుకున్నారు. ఈ పథకం ద్వారా ఏటా రాష్ట్రంలో 70 వేల మందికి, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పది వేల మందికి పైగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభించేది. ఆడబిడ్డల పెళ్లికి భరోసా కనిపించేది.


వైఎస్సార్‌ పేరు మార్చి.. పథకాన్ని ఏమార్చి

ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే పథకానికి తన తండ్రి పేరు పెట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కంటే ఘనమైన కానుక ఇస్తానని ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మలకు రూ.లక్ష, బీసీలకు రూ.50వేలు, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు రూ.లక్ష, కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు రూ.1.25 లక్షలు, కులాంతర వివాహాలు చేసుకున్న బీసీ యువతులకు రూ.75వేలు, దివ్యాగులకు రూ.1.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇది ప్రకటనలకు పరిమితమై గత మూడేళ్లుగా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా ఈ నగదుపై ఆధారపడి పెళ్లి చేసిన కొన్ని వేల కుటుంబాలు నేడో, రేపో వస్తాయన్న ఆశతో పెళ్లి కానుక కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరికీ పెళ్లికానుక దక్కిన దాఖలాలు కనిపించడం లేదు. 


సుప్త చేతనావస్థలో పథకం..

గత మూడేళ్లలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 50 వేల పెళ్లిళ్లు జరిగాయి. వీటిలో ఈ పథకం పరిధిలోకి వచ్చే పెళ్లిళ్లు సుమారు 35 వేలు ఉండొచ్చని అంచనా. ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో సుమారు 12 వేల ముస్లి కుటుంబాలు దుల్హన్‌ పథకం కోసం ఎదురు చూస్తున్నాయి. మిగలిన అన్ని వర్గాలకు చెందిన వివాహాలు ఈ మూడేళ్లలో మరో 25వేలు జరిగి ఉంటాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సుమారు పదివేల మంది వైఎస్సార్‌ పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది కరోనా రావడంతో పథకం వాయిదా పడిందని, అందువల్లే పెళ్లికానుక చెల్లింపులు, లేవని కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదని అధికారులు, లబ్ధిదారులు భావిస్తూ వచ్చారు. గత రెండేళ్లుగా అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పెళ్లికానుక దరఖాస్తులు తీసుకోకపోయినా ఓపికతో ఎదురు చూస్తున్నారు. కాగా ఇదే విషయంపై జిల్లా అధికారులను ఆరా తీయగా వారు కూడా పథకం ఉనికిలో ఉందో లేదో తమకు కూడా స్పష్టత లేదని చెబుతుండడం విశేషం.


ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో బయటపడ్డ అసలు విషయం

దుల్హన్‌ పథకం అమలు చేయకపోవడంతో కొంతకాలం ముస్లిం మైనార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం బయట పడింది. నిధులు లేని కారణంగా పథకాన్ని నిలిపి వేశామని ప్రభుత్వం చావుకబురు చల్లగా చెప్పింది. దీంతో ఇప్పటి వరకు ఏదో ఒక నాడు పెళ్లి కానుక వస్తుందిలే అన్న నమ్మకంతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలు ఆవిరైపోయాయి. ప్రభుత్వమే పథకాన్ని నీరుకార్చిందని వారు వాపోతున్నారు.  


 

Updated Date - 2022-07-03T04:47:18+05:30 IST