యూట్యూబర్‌‌కు కాలింది.. 2.4 కోట్ల కారు బూడిదైంది

ABN , First Publish Date - 2020-10-28T22:16:29+05:30 IST

రష్యాకు చెందిన మైఖఏల్ లిట్విన్ అనే వ్యక్తి యూట్యూబర్. సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ యూట్యూబర్లలో లిట్విన్ ఒకడు. ఇతడు కొద్ది రోజుల క్రితం ఎంతో ఇష్టంతో మెర్సిడెజ్ బెంజ్ కారు కొన్నాడు

యూట్యూబర్‌‌కు కాలింది.. 2.4 కోట్ల కారు బూడిదైంది

న్యూఢిల్లీ: అదేదో సినిమాలో చిరంజీవి కారును తాకాడని నగ్మా తన కారును నడి బజార్లో తగలబెడుతుంది. ఇక వివి వినాయక్ లాంటి సినిమాల్లో సుమోలు గాల్లో ఎగరడం, బాంబు బ్లాస్టుల్లో పేలిపోవడం మామూలే. ఇవన్నీ రీల్ కథలు.. కానీ రియల్‌గా కూడా ఇలాంటి సంఘటన జరిగింది. తన కారు బాగా ఇబ్బంది పెట్టేస్తోందని, 2.4 కోట్ల రూపాయల విలువైన కారును తగలబెట్టాడు రష్యాకు చెందిన యూట్యాబర్. అంతేనా, ఈ దృశ్యాన్నంతా వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరేమో ‘ఈ వీడియోకు వచ్చే డబ్బులతో అలాంటివి రెండు కొనుక్కోవచ్చులే’ అని కొంటెగా సమాధానమిస్తున్నారు.


రష్యాకు చెందిన మైఖేల్ లిట్విన్ అనే వ్యక్తి యూట్యూబర్. సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ యూట్యూబర్లలో లిట్విన్ ఒకడు. ఇతడు కొద్ది రోజుల క్రితం ఎంతో ఇష్టంతో మెర్సిడెజ్ బెంజ్ కారు కొన్నాడు. అయితే కారు తరుచూ బ్రేక్‌డౌన్ అవుతూ లిట్విన్‌ను ఇబ్బంది పెడుతోంది. సమస్య వచ్చిన ప్రతీసారి తనకు కారు అమ్మిన డీలర్ వద్దకు తీసుకెళ్తున్నాడు. ఆయనేమో రెండు రోజులు ఉంచుకుని తిరిగి ఇస్తున్నాడు. కానీ, సమస్య పరిష్కారం కావడం లేదు. ఇలా ఇప్పటికే ఐదు సార్లు జరిగిందట.


ఎన్ని సార్లు రిపేర్‌కు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని లిట్విన్‌కు కోపమొచ్చి కారును కాల్చేద్దామని నిర్ణయించుకున్నాడు. విశాలమైన మైదానాన్ని ఎంచుకుని కారులో తెచ్చిన పెట్రోల్‌ను మొత్తం చల్లి.. దూరం నుంచి నిప్పును వెలిగించాడు. చూస్తుండగానే కారు బూడిదైంది. కారు బూడిదవుతుంటే సినిమాలో హీరోలా చిప్స్ తింటు కెమెరా ముందు ఫోజులు పోయాడు. అనంతరం, పాత కాలం నాటి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కారు ట్రబుల్ ఇస్తుందని మెర్సిడెజ్‌ను కాల్చేసి.. నెడితే కానీ స్టార్ట్ కాని పాత కాలం నాటి కారును.. ఓ నలుగురిని పిలిచి మరీ స్టార్ట్ చేయించుకుని వెళ్లాడు.



Updated Date - 2020-10-28T22:16:29+05:30 IST