పోలీసుల విచారణ భయంతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-15T05:04:40+05:30 IST

హత్య కేసులో పోలీసుల విచారణ భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేర్యాల మండలం ముస్త్యాలలో జరిగింది. ముస్త్యాల గ్రామంలో బెల్ట్‌షాప్‌ నిర్వహించే దేవరాయ ఎల్లవ్వ ఇటీవల హత్యకు గురైంది. పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు.

పోలీసుల విచారణ భయంతో యువకుడి ఆత్మహత్య

పోలీసులు వేధించారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు


చేర్యాల/మద్దూరు, సెప్టెంబరు 14 : హత్య కేసులో పోలీసుల విచారణ భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేర్యాల మండలం ముస్త్యాలలో జరిగింది. ముస్త్యాల గ్రామంలో బెల్ట్‌షాప్‌ నిర్వహించే దేవరాయ ఎల్లవ్వ ఇటీవల హత్యకు గురైంది. పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తాటిపాముల భాస్కర్‌ (25)ను సోమవారం పోలీసులు విచారించారు. మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పడంతో భయంతో ఇంట్లోంచి వెళ్లిన భాస్కర్‌ మంగళవారం మద్దూరు మండలం సలాక్‌పూర్‌ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో అడిషనల్‌ ఏస్పీ సందెపోగు మహేందర్‌, చేర్యాల సీఐ భీంరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని చేర్యాల మార్చురీకి తరలించారు. 


భయంతోనే ఆత్మహత్య

హత్య చేసినట్టు అంగీకరించాలని పోలీసులు వేధించడంతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు తమ కుమారుడిని చిత్రహింసలకు గురిచేశారని వారు మండిపడ్డారు. ఈమేరకు వారు మద్దూరు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చేర్యాల సీఐ భీంరెడ్డి శ్రీనివా్‌సరెడ్డిని వివరణ కోరగా ఎల్లవ్వ హత్యకేసులో 20 మందిని విచారించామని, ఫోన్‌కాల్‌ డాటా ఆధారంగా భాస్కర్‌ ను కూడా విచారించామని చెప్పారు. అతడిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని వివర ణ ఇచ్చారు.


‘తీవ్రంగా కొట్టారు..’ వైరల్‌గా మారిన మృతుడి ఆఖరు మాటలు

పోలీసులు తీవ్రంగా కొట్టారని మృతుడు చివరిసారిగా తన మిత్రులతో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ వాయిస్‌ రికార్డింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణకు పిలిచిన పోలీసులు తీవ్రంగా కొట్టారని, మళ్లీ పోలీసులు స్టేషన్‌కు రమ్మన్నారని, ఈసారి మొద్దుకు ఎక్కిస్తామని బెదిరించారని మృతుడు భాస్కర్‌ ఆత్మహత్య చేసుకునే కొద్ది గంటల ముందు మిత్రులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశాడు. 

Updated Date - 2021-09-15T05:04:40+05:30 IST