15 నెలల క్రితమే కూతురికి పెళ్లి.. బాత్రూంలోంచి సీక్రెట్‌గా తల్లికి ఫోన్.. ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-06-22T22:09:13+05:30 IST

ఆ వేధింపులు భరించలేక, పుట్టింటికి వెళ్లలేక ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

15 నెలల క్రితమే కూతురికి పెళ్లి.. బాత్రూంలోంచి సీక్రెట్‌గా తల్లికి ఫోన్.. ఆమె చెప్పింది విని..

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు.. అల్లుడికి కట్నంగా ఒక ఎకరా భూమి, 800 గ్రాముల బంగారం, ఒక టయోటా కారు ఇచ్చారు.. అయినా అవి అతనికి సరిపోలేదు.. ఇంకా కట్నం తీసుకు రమ్మని వేధించేవాడు.. రోజూ చిత్రహింసలు పెట్టేవాడు.. ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడు.. ఆ వేధింపులు భరించలేక, పుట్టింటికి వెళ్లలేక ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కేరళలో జరిగిన ఈ ఘటన వరకట్న వేధింపులను మరోసారి తెర మీదకు తీసుకొచ్చింది. 


కేరళలోని కొల్లం జిల్లా శాస్తంకోట  గ్రామానికి చెందిన విస్మయ (22) బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ చివరి సంవత్సరం చదువుతోంది. గతేడాది విస్మయను కొల్లం జిల్లాకు చెందిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టరు కిరణ్ వివాహం చేసుకున్నాడు. అత్తమామలు భారీ కట్నం ఇచ్చినా అదనపు కట్నం కోసం విస్మయను వేధించడం మొదలుపెట్టాడు. రోజూ కొట్టేవాడు. ఒకసారి అత్తమామల ఇంటికి కూడా తాగి వెళ్లి గొడవ చేయడంతో వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు రాజీ కుదర్చడంతో విస్మయ మళ్లీ కిరణ్‌తోపాటు వెళ్లింది. అక్కడకు వెళ్లాక మళ్లీ వేధింపులు మామూలే. విస్మయను తండ్రితోనూ, అన్నయ్యతోనూ మాట్లాడనివ్వలేదు. ఒకసారి బాత్రూమ్‌లోకి వెళ్లి తల్లికి సీక్రెట్‌గా ఫోన్ చేసి విస్మయ తన బాధలు చెప్పుకుంది. భర్త కొట్టాడని, నోటి నుంచి రక్తం వస్తోందని చెప్పింది. దీంతో తల్లి ఇంటికి వచ్చేయమని అడిగినా విస్మయ రాలేదు. ఇంటికి వస్తే అందరూ నానా రకాలుగా అనుకుంటారని భయపడింది. 


చనిపోవడానికి రెండ్రోజుల ముందు కజిన్‌కు తన శరీరం మీద గాయాల ఫొటోలను వాట్సాప్‌లో పంపించింది. చివరకు మనోవేదనతో బాత్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విస్మయ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేరళ మహిళా కమిషన్ సుమోటాగా ఈ కేసును స్వీకరించింది. `కట్నం వేధింపుల వల్ల చనిపోయిందని తెలియగానే మేం కేసు నమోదు చేశాం. విస్మయ గాయాలకు సంబంధించిన ఫొటోలు, వాట్సాప్ మెసేజ్‌లు ఆమె సోదరుడు మాకు పంపించాడు. ఈ కేసును పరిశోధించాల్సిందిగా కొల్లాం రూరల్ ఎస్పీని కోరాం. కుటుంబ సభ్యులకు నమ్మకమున్న హాస్పిటల్‌లోనే విస్మయ పోస్ట్‌మార్టం నిర్వహిస్తామ`ని మహిళా కమిషన్ సభ్యురాలు షహిదా కమల్ చెప్పారు.  

Updated Date - 2021-06-22T22:09:13+05:30 IST