యోగి ఆదిత్యనాథ్ 7 రికార్డులు

ABN , First Publish Date - 2022-03-10T20:52:50+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ

యోగి ఆదిత్యనాథ్ 7 రికార్డులు

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఆ పార్టీ నేతృత్వంలో తదుపరి ప్రభుత్వం ఏర్పడితే, ముఖ్యమంత్రిగా మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలను చేపడితే, సరికొత్త రికార్డులు నమోదవుతాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఐదేళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత తిరిగి అధికారం చేపట్టే మొదటి ముఖ్యమంత్రిగా యోగి రికార్డు సృష్టిస్తారు. ఆ రాష్ట్రంలో 1985 తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి పార్టీగా బీజేపీ రికార్డు సృష్టిస్తుంది. 


గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు తిరిగి ఆ పదవిని చేపట్టినప్పటికీ, వారు ఐదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. యోగి ఐదేళ్ళపాటు పూర్తిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించిన తర్వాత మళ్ళీ ఆ పదవిని చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి, గెలిచి, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం 15 ఏళ్ళలో తొలిసారి అవుతుంది. అదే విధంగా నోయిడాలో పర్యటించి, ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకునే నేతగా కూడా ఆయన నిలవబోతున్నారు. నోయిడాలో పర్యటించిన ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోతారనే ప్రచారం గతంలో జరిగింది. 


49 ఏళ్ళ యోగి ఆదిత్యనాథ్ మొదట్లో గోరఖ్‌పూర్ మఠానికి పరిమితమై ఉండేవారు. ఆయన ‘హిందూ హృదయ సామ్రాట్’ అని ఆయన మద్దతుదారులు అంటారు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పటి బీజేపీ నేత మహంత్ అవైద్యనాథ్ శిష్యరికంలో రాజకీయాల్లో ఎదిగారు. తన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ మందిరం ప్రధాన అర్చకుడవుతారని అవైద్యనాథ్ ప్రకటించారు. అప్పటికి యోగి ఆదిత్యనాథ్ వయసు 22 సంవత్సరాలు. విశ్వవిద్యాలయంలో ఏబీవీపీలో చేరారు. 1998లో అవైద్యనాథ్ తన లోక్‌సభ స్థానాన్ని ఆదిత్యనాథ్‌కు ఇచ్చారు. 1998 నుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 


2017 శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. మరికొన్ని నిర్ణయాలు ప్రజాదరణను తెచ్చిపెట్టాయి. 2022 శాసన సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ ప్రధాన ప్రచారకర్తగా మారారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా గట్టిగా ప్రచారం చేశారు. ఆయనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. 


ఉత్తర ప్రదేశ్‌కు వెలుపల కూడా ఆదిత్యనాథ్ ప్రత్యేక ఆకర్షణను సంపాదించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. గత ఏడాది నవంబరులో ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలక స్థానాన్ని సంపాదించారు. 


యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నమోదయ్యే రికార్డులు: 


- వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలను చేపట్టిన ఐదో నేత


- 37 సంవత్సరాల్లో అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి ముఖ్యమంత్రి


- 15 ఏళ్ళలో సీఎం అయిన తొలి ఎమ్మెల్యే


- ఐదేళ్ళ  పదవీ కాలాన్ని పూర్తి చేసిన మూడో సీఎం 


- నోయిడాకు వెళ్లినవారు తమ పదవిని కోల్పోతారనే మూఢనమ్మకాన్ని పటాపంచలు చేసిన ముఖ్యమంత్రి 


- ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, రెండోసారి ఆ పదవిని చేపట్టిన నేత 


- అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి బీజేపీ ముఖ్యమంత్రి.


Updated Date - 2022-03-10T20:52:50+05:30 IST