యోగాతో ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-21T05:51:21+05:30 IST

ఒత్తిడిమయమైన జీవనవిధానం.. మారిన జీవనశైలితో ఆధునిక ప్రపంచంలో ప్రతీఒక్కరు అనారోగ్యాలతో సావాసం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు విరుచుకుపడుతున్న మహమ్మారులు మానవ మనుగడకు సవాలుగా విసురుతున్నాయి. ఈ సమస్యలకు యోగా పరిష్కారం చుపుతున్నది.

యోగాతో ఆరోగ్యం

మానసిక, శారీరక స్వస్థతకు ఆసనాలు

దీర్ఘకాలిక వ్యాధులకు విరుగుడు

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం


మెదక్‌అర్బన్‌/సంగారెడ్డిరూరల్‌/చేర్యాల, జూన్‌ 20 : ఒత్తిడిమయమైన జీవనవిధానం.. మారిన జీవనశైలితో ఆధునిక ప్రపంచంలో ప్రతీఒక్కరు అనారోగ్యాలతో సావాసం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు విరుచుకుపడుతున్న మహమ్మారులు మానవ మనుగడకు సవాలుగా విసురుతున్నాయి. ఈ సమస్యలకు యోగా పరిష్కారం చుపుతున్నది. వేల సంవత్సరాల క్రితమే యోగా ఆచరణలో ఉన్నట్టు గుర్తింపబడినది. అప్పటి నుంచి వివిధ పేర్లతో ఆచరింపబడుతున్నది. ఇటీవలి కాలంలో యోగాకు ఆధరణ పెరిగింది. ప్రజల దైనందిన జీవనవిధానంలో భాగంగా మారుతున్నది.  ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారు. వీటిలో 40కి పైగా ముస్లిం దేశాలు కూడా ఉండటం విశేషం. ఆసనాలతో అవసరమైనంత శారీరక శ్రమను కలిగించి శరీరంలోని హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని ఇది అందిస్తుంది. హృద్రోగాలు, మఽధుమేహం, అధిక రక్తపోటు, రక్తంలో చెడుకొలెస్ట్రాల్‌ పెరుగుదల, వెన్నునొప్పి తదితర దీర్ఘకాలిక అనారోగ్యాలకు యోగా నివారిణిగా నిలుస్తున్నది. అల్లోపతి వైద్యులు సైతం దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కోసం యోగాను ఆచరించమని సూచిస్తున్నారు. కరోనా బారినపడినవారికి యోగాను సూచించడమే ఇందుకు నిదర్శనం.


యోగాసనాల్లో రకాలు

యోగాసనాల్లో 21 రకాలు ఉంటాయి. వీటితో పాటు సూర్యనమస్కారాలు, నాలుగు రకాల ప్రాణాయామాలు, ఽధ్యానం, సంకల్పం, శాంతిమంత్రం ఉన్నాయి. యోగాసనాల్లో వజ్రాసనం, సిద్ధాసనం, పద్మాసనం, సత్యాంగాసనం, శీర్షాసనం, అర్థమయూరాసనం, ఉపవిష్టకోవాసనం, గరుడాసనం, చక్రాసనం, కటీచక్రాసనం, బ్యాగ్రాసనం తదితరాలు అనేక శారీరక సమస్యలకు పరిఆ్కరం చూపుతాయి. యోగసాధనలో అష్టాంగాలు (8 మెట్లు) ఉన్నాయి. 1. యమ (సామూహిక క్రమశిక్షణ), 2. నియమ (వ్యక్తిగత క్రమశిక్షణ), 3. ఆసన (దైహిక భంగిమ నైపుణ్యం), 4. ప్రాణాయామ (మనసులోని అద్భుత శక్తి ప్రదర్శన), 5. ప్రత్యాహార  (ఇంద్రియ నిగ్రహణ), 6. ధ్యాన (ధ్యానం), 7. ధారణ (ఏకాగ్రత), 8. సమాధి (తననుతాను తెలుసుకోవడం). ఈ సోపానాలను నిత్యం ఆచరించడం ద్వారా వ్యక్తి వికాసం జరుగుతుంది.


యోగాతో ప్రయోజనాలు

యోగా ఒత్తిడిని నియంత్రించడం ద్వారా అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. జీర్ణ సంబంధ వ్యాధులను నిర్మూలిస్తుంది. మెడ, మోకాళ్లు, కండరాలనొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. హైపర్‌ థైరాయిడిజాన్ని నియంత్రిస్తుంది. శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యోగాతో ఊపరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, సంతానలేమిని అధిగమిస్తుంది. క్రమంతప్పకుండా యోగా అభ్యసించేవారిలో జ్ఞాపకశక్తి, జీర్ణశక్తి పెరుగుతుంది. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. 


మెదక్‌లో ఉచిత యోగా తరగతులు

మెదక్‌ పట్టణానికి చెందిన ఆకుల రవి 1990లో పతంజలి యోగా కేంద్రాన్ని స్ధాపించి ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 10 వేల మందికి యోగా నేర్పించారు. 2014 నుంచి వశిష్ఠ యోగా కేంద్రం ఆధ్వర్యంలో నిత్యం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఉచిత యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. యోగాతో ఒత్తిడి దూరమవుతుందని, జ్ఞాపకశక్తి ఇనుమడిస్తుందని ఆయన బోధిస్తారు. ఆయన సేవలను గుర్తింపుగా పలు అవార్డులను అందుకున్నారు.

Updated Date - 2021-06-21T05:51:21+05:30 IST