బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రశేఖర్‌

ABN , First Publish Date - 2020-06-01T10:18:40+05:30 IST

బీజేపీ మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే మరాఠి చంద్రశేఖర్‌(ఎర్ర శేఖర్‌) నియమితులయ్యారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రశేఖర్‌

మహబూబ్‌నగర్‌, మే 31 (ఆంధ్రజ్యోతి):   బీజేపీ మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే మరాఠి చంద్రశేఖర్‌(ఎర్ర శేఖర్‌) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే దివంగత ఎర్ర సత్యం సోదరునిగా రాజకీయాల్లోకి వచ్చిన ఎర్రశేఖర్‌ బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. తొలుత టీడీపీ నుంచి 1995లో ధన్వాడ ఎంపీపీ పని చేశారు. ఆ తర్వాత తన సోదరుడు ఎర్ర సత్యం మరణానంతరం జడ్చర్ల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేస్థానం నుంచి 1999లో, 2009లో విజయం సాధించారు.


అదేస్థానంలో 2004లో, 2008లో, 2014లో ఓటమిపాలయ్యారు. తాజాగా జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ప్రజాకూటమి అఽభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు పనిచేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో మార్పులతో ఆయన టీడీపీని వీడి 2019 ఆగస్టులో బీజేపీలో చేరారు. తాజాగా ఆయన్ను బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి వరించింది. ఈ సందర్భంగా ఎర్రశేఖర్‌ మాట్లాడుతూ తనకు కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడికి, మాజీ మంత్రి డీకే అరుణకు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌కు, బీజేపీ సీనియర్‌ నాయకులు పద్మజారెడ్డి, పడాకుల బాలరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన్నానని చెప్పారు.

Updated Date - 2020-06-01T10:18:40+05:30 IST