ఏడాది పాప కిడ్నాప్‌..!

ABN , First Publish Date - 2020-10-02T07:57:52+05:30 IST

చాకచక్యంగా వ్యవహరించిన రాచకొండ పోలీసులు కిడ్నాపర్‌ చెరనుంచి ఏడాది పాపను రక్షించారు.

ఏడాది పాప కిడ్నాప్‌..!

రక్షించిన రాచకొండ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): చాకచక్యంగా వ్యవహరించిన రాచకొండ పోలీసులు కిడ్నాపర్‌ చెరనుంచి ఏడాది పాపను రక్షించారు.  బోడుప్పల్‌ అంబేడ్కర్‌నగర్‌ కాలనీకి చెందిన దార శంకర్‌ ప్లంబర్‌ పనిచేస్తుంటాడు. గురువారం సాయంత్రం 4 గంటలకు అతడి చేతిలో ఉన్న ఏడాది పాప గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించింది. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న మేడిపల్లి పెట్రోలింగ్‌ పోలీసులు అతడిని గుర్తించారు. ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో దగ్గరకు వెళ్లారు.


పోలీసుల రాకను గమనించిన శంకర్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.  అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. దీంతో ఆ పాపను గోపాలపురం పరిధిలో కిడ్నాప్‌ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. మేడిపల్లి పోలీసులు గోపాలపురం పోలీసులను సంప్రదించగా, గురువారం మధ్యాహ్నం పాప మిస్సింగ్‌ కేసు నమోదైనట్లు తెలిపారు. దాంతో మేడిపల్లి పోలీసులు పాపను గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. 

Updated Date - 2020-10-02T07:57:52+05:30 IST