వైసీపీ మైండ్‌ గేమ్‌!!

ABN , First Publish Date - 2021-03-04T06:50:54+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో..

వైసీపీ మైండ్‌ గేమ్‌!!

గంటా త్వరలో పార్టీలో చేరతారని సాయిరెడ్డి ప్రకటన

గంటాను నమ్మొద్దంటూ మూడు రోజుల క్రితమే ఉత్తర నియోజక వర్గంలో ప్రచారం

ఆయన ప్రజలను పట్టించుకోరని విమర్శలు

నాలుగు రోజుల్లోనే మాట మార్చిన వైనం

మరో ఐదు రోజుల్లో జీవీఎంసీ ఎన్నికలు జరగనున్న సమయంలో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన మైండ్‌ గేమ్‌లాగానే ఉందన్న గంటా

ప్రస్తుతం నేను టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నా

వార్డుల్లో ప్రచారం కూడా ప్రారంభించాం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార పార్టీ వైసీపీ అనేక రకాల ఎత్తుగడలు వేస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులను కొందరిని బెదిరించి పార్టీలోకి తీసుకుంది. మరికొందరిని బరి నుంచి తప్పించింది. ఇప్పుడు నగర ఓటర్లను అయోమయానికి గురిచేసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఎంపీ విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో చేరబోతున్నారంటూ బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు. గంటా ముఖ్య అనుచరుడు బొడ్టేటి కాశీ విశ్వనాథం వైసీపీ ప్రభుత్వ వేధింపులు (భీమిలి బీచ్‌ రోడ్డులో ఆయన నిర్వహిస్తున్న గోకార్టింగ్‌ను నాలుగు నెలల క్రితం పూర్తిగా షెడ్లతో సహా కూల్చివేశారు) భరించలేక బుధవారం ఆ పార్టీలో చేరిపోయారు. సాయిరెడ్డి చేతులు మీదుగా కండువా వేయించుకున్నారు. ఈ సందర్భంలోనే ఎంపీ ఉద్దేశపూర్వకంగా గంటాపై వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు గంటా కొన్ని ప్రతిపాదనలు చేశారని, వాటికి ఆమోదయోగ్యమైతే వస్తామని వర్తమానం పంపారని పేర్కొన్నారు.


మూడు రోజుల క్రితమే విమర్శలు

వాస్తవానికి విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాగా వేసినప్పటి నుంచి గంటాను లక్ష్యంగా చేసుకుని ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. భూములు కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. సిట్‌ నివేదిక వస్తే ఆయనపై చర్యలు ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. తాజాగా మూడు రోజుల క్రితం... అంటే ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఆయన ‘గంటాను నమ్మొద్దు’ అంటూ అక్కడి ప్రజలకు సూచించారు. గంటా గెలిచిన తరువాత నియోజకవర్గ ప్రజలను పట్టించుకోరని, వేరే నియోజకవర్గానికి వెళ్లిపోతారని ఆరోపించారు. ఆయన కంటే వైసీపీ ఇన్‌చార్జి కేకే రాజును నమ్ముకుంటే మంచిదని సలహా కూడా ఇచ్చారు. అటువంటి సాయిరెడ్డి మూడు రోజుల్లోనే మాట మార్చి... ‘గంటా వైసీపీలోకి వస్తున్నారు’ అంటూ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


అయితే రాజకీయంగా తెలుగుదేశం వర్గాలతో పాటు ఓటర్లను అయోమయానికి గురిచేసి లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే విజయసాయిరెడ్డి అలా మాట్లాడారంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు కూడా అదేవిధంగా వ్యాఖ్యానించారు. ఇంకో ఐదు రోజుల్లో విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న సమయంలో తాను వైసీపీలో చేరతానని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించడం మైండ్‌ గేమ్‌లాగే ఉందన్నారు. తాను సీఎంకు చేసిన ప్రతిపాదనలు ఏమిటో సాయిరెడ్డే వివరించాలని కోరారు. తాను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా ఉన్నానని, జీవీఎంసీ ఎన్నికలకు కార్పొరేటర్‌ అభ్యర్థులను ఎంపిక చేశానని, వార్డుల్లో ప్రచారం కూడా చేపట్టామని, ఇప్పుడు వైసీపీ నేతలు ఈ ప్రకటన చేశారంటే...తప్పకుండా మైండ్‌ గేమ్‌ అయి వుంటుందని అభిప్రాయపడ్డారు. 


వ్యక్తిగత అభిప్రాయాలతో పనిలేదు

వైసీపీలోకి ఎవరినైనా తీసుకోవాలంటే దానికి నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో పని లేదని, పార్టీయే నిర్ణయం తీసుకుంటుందని సాయిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. గంటా శ్రీనివాసరావు చేరికను ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముందు నుంచి వ్యతిరేకిస్తున్న విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ...ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు చర్చించి నిర్ణయిస్తారని, సీఎం నిర్ణయమే అంతిమమని, దాన్ని అంతా శిరసావహిస్తామని చెప్పారు. 


మంత్రి ముత్తంశెట్టి దూరం... దూరం

గంటా ప్రధాన అనుచరుడు బొడ్డేటి కాశీ వైసీపీలో చేరుతుంటే...ఆ కార్యక్రమానికి జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గైర్హాజరయ్యారు. అదే సమయంలో ఆయన నగరంలోని దొండపర్తిలో ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. తిమ్మాపురంలో విజయసాయిరెడ్డి సమక్షంలో కాశీ చేరగా, విలేఖరులు మంత్రి ముత్తంశెట్టి ప్రస్తావన తీసుకువచ్చారు. ఆయన ఎందుకు ఈ కార్యక్రమానికి రాలేదని ప్రశ్నించారు. దానికి కాశీయే సమాధానం ఇచ్చారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో తనకు విభేదాలు ఏమీ లేదని, ప్రజారాజ్యం పార్టీ నుంచే ఆయనతో కలిసి పనిచేశానని, వెంటనే ఆయన్ను కూడా కలసి ఆశీర్వాదం తీసుకుంటానని  ప్రకటించారు. చెప్పినట్టుగానే సాయంత్రం మంత్రి ఇంటికి వెళ్లి కలిశారు.

Updated Date - 2021-03-04T06:50:54+05:30 IST