‘పురం’లోనూ.. పాగా వేసేద్దాం!

ABN , First Publish Date - 2021-02-27T05:14:43+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల్లో కూడా వైసీపీ మార్క్‌ రాజకీయాలకు తెరలేచింది. ‘పుర’ పోరుకు కొత్తగా నామినేషన్లు స్వీకరించాలనే పిటీషన్‌ను సైతం కోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథాతథంగా నిర్వహించేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, వైసీపీతో పాటు బీజేపీ, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల నాయకులు మునిసిపాల్టీల్లో పాగా వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

‘పురం’లోనూ.. పాగా వేసేద్దాం!

మునిసిపల్‌ ఎన్నికల్లో వైసీపీ మార్క్‌ రాజకీయాలు

టీడీపీకి పట్టున్న స్థానాలపై నేతల ప్రత్యేక దృష్టి 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

మునిసిపల్‌ ఎన్నికల్లో కూడా వైసీపీ మార్క్‌ రాజకీయాలకు తెరలేచింది. ‘పుర’ పోరుకు కొత్తగా నామినేషన్లు స్వీకరించాలనే పిటీషన్‌ను సైతం కోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథాతథంగా నిర్వహించేందుకు పచ్చ జెండా ఊపింది.  ఈ నేపథ్యంలో జిల్లాలో పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, వైసీపీతో పాటు బీజేపీ, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల నాయకులు మునిసిపాల్టీల్లో పాగా వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడినా... టీడీపీ మద్దతుదారులు గత సార్వత్రిక ఎన్నికల కంటే మెరుగైన ఓటు బ్యాంకును పదిలం చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో ‘పుర’ పోరులోనూ సత్తా చాటేందుకు టీడీపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తమ మద్దతుదారులను గెలిపించుకున్న వైసీపీ నేతలు..  అదే స్థాయిలో పట్టణాల్లో కూడా పట్టు సాధించేందుకు తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. టీడీపీకి పట్టున్న కేంద్రాల్లో ఓట్లను తమవైపు మళ్లించుకొనేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ముఖ్యనేతలంతా పట్టణాల బాట పట్టారు. స్వయంగా మంత్రులు సైతం రంగంలోకి దిగి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహం రచిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలతో రహస్య భేటీలు, మంతనాలు సాగిస్తున్నారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కవిటిలో ఇచ్ఛాపురం నేతలతో సమాలోచనలు చేశారు. ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలో 23 వార్డులు ఉన్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, ఇచ్ఛాపురంలో వైసీపీ అభ్యర్థి పిలక రాజ్యలక్ష్మి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక నియోజకవర్గాలు వైసీపీ దక్కించుకుంది. కానీ, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. ఇచ్ఛాపురంలో ఎమ్మెల్యేగా బెందాళం అశోక్‌ను ఎన్నుకున్నారు. దీంతో టీడీపీకి పట్టు ఉన్న ఈ మునిసిపాలిటీలో ఎలాగైనా పాగా వేయాలని డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది.  


 పలాస-కాశీబుగ్గలో...


 పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో 31 వార్డులు ఉన్నాయి. టీడీపీకి చెందిన కోత పూర్ణచంద్రరావు ఈ మునిసిపాలిటీకి తాజా మాజీ చైౖర్మన్‌గా చేశారు. తర్వాత ఆయన మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల వైసీపీలో చేరారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఈ మునిసిపాలిటీలో వైసీపీకి మంచి పట్టు ఉంది. అదే స్థాయిలో టీడీపీకి కూడా ఆదరణ ఎక్కువే. ఈ నేపథ్యంలో రానున్న మునిసిపల్‌ పోరులో ఇరు పార్టీలు సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి. మంత్రి స్వయంగా రంగంలోకి దిగి వార్డు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎలాగైనా చైర్మన్‌ పదవిని చేజిక్కుంచుకోవాలనే వ్యూహంతో ఉన్నారు. 


 పాలకొండలో  


పాలకొండ నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. టీడీపీకి చెందిన విజయనిర్మల తాజా మాజీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి చెందిన విశ్వాసరాయ కళావతి ఎమ్మెల్యేగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. పురుపోరులోనూ   విజయఢంకా మోగించేందుకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు వైసీపీ సీనియర్‌ నేత కుమారుడు గెలుపు బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద మూడు మునిసిపాలిటీల్లోనూ ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారనేది చర్చనీయాంశమవుతోంది. 

Updated Date - 2021-02-27T05:14:43+05:30 IST