సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2021-10-21T06:27:05+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ నాయ కులు హెచ్చరించారు.

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
పాడేరులో ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నాయకులు

వైసీపీ నేతల హెచ్చరిక..  నిరసన ర్యాలీలు


పాడేరురూరల్‌, అక్టోబరు 20: ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ నాయ కులు హెచ్చరించారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ట్రైకార్‌ చైర్మన్‌ సతకా బుల్లిబాబు ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన వీరిని జూనియర్‌ కళాశాల  సమీపంలో పోలీసులు అడ్డగించారు. దీంతో రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు నినాదాలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కిముడు గాయత్రీదేవి, వి.బసవన్నదొర, కిముడు విశ్వ, సీదరి రాంబాబు, గబ్బాడ చిట్టిబాబు, వంతాల రాంబాబు, పాంగి రాంబాబు, వంతాల సీతమ్మ, సీదరి మంగ్లన్నదొర, తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబు, పట్టాభి క్షమాపణలు చెప్పాలి

అరకులోయ: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి తక్షణమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ డిమాండ్‌ చేశారు. బుధవారం రాత్రి వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్‌ విగ్రహంవద్ద  కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక నోటికొచ్చి నట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉషారాణి, రామన్న, గాషి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.


కొయ్యూరులో...

కొయ్యూరు: ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, అవమానకరంగా మాట్లాడినా తగిన రీతిలో బుద్ధిచెబుతామని ఎంపీపీ బడుగు రమేశ్‌బాబు, జడ్‌పీటీసీ సభ్యుడు వారా నూకరాజు హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. వైసీపీ నేతలు కొప్పు రాజులమ్మ, జల్లి బాబులు, కాళ్ల వనుంబాబు, రేగటి ముసిలినాయుడు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T06:27:05+05:30 IST