Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ జనాగ్రహ దీక్ష

తిరుపతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి పట్ల టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ వర్గాలు గురువారం జిల్లావ్యాప్తంగా జనాగ్రహదీక్ష పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయ కూడలిలోని దీక్షాశిబిరంలో ఎంపీ గురుమూర్తి, మేయర్‌ శిరీష, డిప్యూటీ మేయర్లు అభినయరెడ్డి, ముద్ర నారాయణ, పార్టీ నేతలు పాల్గొన్నారు. కొందరు మహిళా కార్యకర్తలు చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి వ్యతిరేక నినాదాలు చేశారు. చిత్తూరు నగరం గాంధీ కూడలిలో మేయర్‌ ఆముద, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్‌, రాజేశ్‌కుమార్‌రెడ్డి, చుడా ఛైర్మన్‌ పురుషోత్తంరెడ్డి, నేతలు దీక్ష చేశారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలో జరిగిన దీక్షలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, వైసీపీ ఇన్‌ఛార్జి భరత్‌, నేతలు పాల్గొన్నారు. పలమనేరు టవర్‌ క్లాక్‌ కూడలిలోని జాతీయ రహదారిపై ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో పట్టాభి దిష్టిబొమ్మ దహనం చేశారు. వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పుత్తూరులో ఎమ్మెల్యే రోజా, సత్యవేడులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. పుంగనూరు ప్రైవేటు బస్టాండులోని దీక్షా శిబిరంలో జానపద కళల అకాడమీ ఛైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీమ్‌ బాషా, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండు కూడలిలో చేపట్టిన దీక్షా శిబిరంలో ఏపీఎండీసీ ఛైర్‌పర్సన్‌ షమీమ్‌ అస్లామ్‌ పాల్గొనగా, బి.కొత్తకోటలో కార్యకర్తలు ధర్నా చేశారు. శ్రీకాళహస్తి పట్టణం పెళ్ళి మండపం వద్ద జరిగిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రగిరిలో దీక్షకు తిరుపతి రూరల్‌ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి హాజరయ్యారు. పలు మండల కేంద్రాల్లోనూ దీక్షలు జరిగాయి. 

Advertisement
Advertisement