తాడో.. పేడో.. .. తేల్చుకుంటాం..!

ABN , First Publish Date - 2022-05-26T05:59:01+05:30 IST

హిందూపురం వైసీపీలో అసమ్మతి తారస్థాయికి చేరింది. నాయకుల మ ధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది.

తాడో.. పేడో.. .. తేల్చుకుంటాం..!

అమరావతికి అసమ్మతి సెగ

రాజధానికి చేరిన పురం వైసీపీ పంచాయితీ 

అధిష్టానం వద్దకు నాయకులు

తేల్చుకుని వస్తామంటూ ప్రతిజ్ఞ

‘గడపగడపకు..’ కార్యక్రమాన్ని 

ప్రారంభించిన ఎంపీ.. కొందరే హాజరు


హిందూపురం టౌన, మే 25: హిందూపురం వైసీపీలో అసమ్మతి తారస్థాయికి చేరింది. నాయకుల మ ధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. అసమ్మతి సెగ ఏకం గా అమరావతిని తాకింది. పంచాయితీ.. అధిష్టానం పెద్దల వద్దకు చేరింది. తాడో.. పేడో.. అధిష్టానంతో తేల్చుకునే వస్తామంటూ అసమ్మతి వర్గం ప్రతిజ్ఞ చేసి మరీ రాజధానికి చేరింది.


ఎన్నికల నాటి నుంచే..

ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌, ఎంపీ గోరంట్ల మాధవ్‌.. నియోజకవర్గంలోని ముఖ్యనాయకుల మధ్య సమన్వ యం లేకపోగా పోరు తీవ్రతరం అవుతోంది. బాహాటంగానే ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ 2019లో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసినప్పటి నుంచి స్థానిక ముఖ్య నాయకులు, ప్ర స్తుత ఆగ్రోస్‌ చైర్మన నవీన నిశ్చల్‌, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఇందులోకి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని తోడయ్యారు. చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, మరికొంతమంది ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, మరికొంతమంది సర్పంచలు, ఎంపీటీసీలు, అసమ్మతి వర్గంలో చేరారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ నాలుగైదు రోజులు కార్యక్రమం నిర్వహించారు. తరువాత ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హిందూపురంలో అద్దె ఇల్లు తీసుకున్నారు. దీంతో స్థానిక వైసీపీ ముఖ్య నేతలు మండిపడుతూ అసమ్మతి వర్గాన్ని ఏ కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. హిందూపురంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన బలరాంరెడ్డిని కలుపుకుని కౌన్సిలర్లను ఏకంచేసే యత్నాలు ప్రారంభించారు. మూడురోజులపాటు నియోజకవర్గంలోని అసమ్మతి వర్గాలను ముఖ్య నాయకులు కలిశారు. త్వరలోనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దానిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.


రాజధానికి చేరిన పంచాయితీ

ఆగ్రోస్‌ చైర్మన నవీన నిశ్చల్‌, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, అబ్దుల్‌ఘని, బలరాంరెడ్డి, పురుషోత్తంరెడ్డి, హ నుమంతరెడ్డితోపాటు 15 నుంచి 20మంది కౌన్సిలర్లు, చిలమత్తూరు ఎంపీపీ, మరికొంతమంది ముఖ్య నా యకులు బుధవారం మధ్యాహ్నం అమరావతికి బ యలుదేరారు. ముఖ్య నాయకులు గురువారం వెళ్లనున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రే కొంతమంది కౌన్సిలర్లు, సర్పంచలు, ఎంపీటీసీలు, బెంగళూరు వె ళ్లారు. అక్కడి నుంచి రాజధానికి వెళ్లనున్నట్లు సమాచారం. మొదట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, తరువాతి రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మూడోరోజు ఎంపీ విజయసాయిరెడ్డిని క లిసి హిందూపురంలో పార్టీ పరిస్థితిపై వివరించనున్నట్లు అసమ్మతి వర్గంలోని కొందరు నాయకులు తెలిపారు. అక్కడే తేల్చుకుని, హిందూపురానికి వస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు తెలిసింది.


ముఖం చాటేస్తున్న కార్యకర్తలు

తరచూ హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీలో వర్గపోరు తెరపైకి వస్తుండటంతో సామాన్య కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎప్పుడు ఏ నాయకుడి ఆధిపత్యం సాగుతుందో అర్థంకాక, ఎవరివైపు వెళ్లాలోనన్న ఆలోచనలో పడ్డారు. మరికొంతమంది కార్యకర్తలైతే అధిష్టానం ఎవరికి బాధ్యతలు అప్పగి స్తే వారివెంట ఉంటామని పేర్కొంటున్నారు. ఇంకొందరైతే ఇరు వర్గాలకు ముఖం చాటేస్తున్నారు.


‘గడప గడపకు’ శ్రీకారం

కొద్దిరోజులుగా వాయిదాపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని హిందూపురంలోని మూడోవార్డులో ఎంపీ గోరంట్ల మాధవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ, వైస్‌చైర్మన జబీవుల్లా, కౌన్సిలర్‌ మారుతిరెడ్డి, మరికొంతమంది ఎమ్మెల్సీ వర్గీయులు ప్రారంభించారు. కార్యక్రమానికి చాలామంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో గురువారం హిందూపురం పట్టణం కాకుండా లేపాక్షి మండలంలో ప్రారంభించాలని ఎంపీ సూచించినట్లు తెలిసింది.


Updated Date - 2022-05-26T05:59:01+05:30 IST