వైసీపీ కార్యకర్తల వీరంగం

ABN , First Publish Date - 2022-05-25T06:07:20+05:30 IST

చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేశారు.

వైసీపీ కార్యకర్తల వీరంగం

హిందూపురం టౌన, మే 24: చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేశారు. ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. కొడికొండలో ఇటీవల గ్రామ దేవతకు ఉట్లపరుష నిర్వహించారు. ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిన వైసీపీ కార్యకర్త కోతుల రమేష్‌ పరుషకు స్వగ్రామానికొచ్చాడు. పాతకక్షల నేపథ్యంలో మంగళవారం రమేష్‌ తన అనుచరులతో కలిసి, బస్టాండు వద్దనున్న టీడీపీ కార్యకర్త మూర్తిపై కత్తితో దాడి చేయబోయాడు. పక్కనే ఉన్న అతడి బావమరిది వానవోలు రవి అడ్డుకోబోగా.. అతడి తొడ భాగంలో తీవ్ర గాయమైంది. మూర్తికి కూడా గాయమైంది. అనంతరం అతడిపై రాళ్లు రువ్వారు. అక్కడి నుంచి టీడీపీ సీనియర్‌ నాయకుడు బాలాజీ ఇంటివద్దకెళ్లి, రాళ్లు రువ్వారు. దాడిలో బాలాజీ ఇంటిముందున్న ద్విచక్రవాహనం ధ్వంసమైంది. ఇంటి తలుపులకు రాళ్లు విసరడంతో లోపలున్న కుటుంబికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇదే సందర్భంలో కోతుల రమే్‌షతోపాటు వైసీపీ కార్యకర్త చైతన్య, సాయికుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే చిలమత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హిందూపురానికి తరలించారు. టీడీపీ కార్యకర్త మూర్తి తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం అనంతపురం తీసుకెళ్లారు.


ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

దాడిలో గాయపడిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు హిందూపురం ఆస్పత్రికి రావడంతో విషయం తెలుసుకున్న ఇరు పార్టీల నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. వనటౌన సీఐ ఇస్మాయిల్‌, టూటౌన సీఐ సూర్యనారాయణ, ఎస్‌ఐలు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం కార్యకర్తలను అనంతపురానికి రెఫర్‌ చేయడంతో ఆ పార్టీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి వెనుకే వైసీపీ నాయకులు వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


సకాలంలో స్పందించి ఉండుంటే..

దాడి ఘటనకు సంబంధించి పోలీసులు సకాలంలో స్పందించి ఉండుంటే ఇంత జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. గొడవ జరిగిన అరగంటకు పోలీసులు కొడికొండకు వచ్చారన్నారు. మండల కేంద్రానికి 5కి.మీ., దూరంలో ఉన్న కొడికొండ గ్రామానికి పోలీసులు రావడానికి అరగంట ఎందుకు పట్టిందని టీడీపీ నాయకులు అంటున్నారు. 


ఖండించిన టీడీపీ నాయకులు

కొడికొండలో టీడీపీ నాయకులపై దాడిని హిందూపురం నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, నాయకులు నాగరాజు, ఆనంద్‌, రమేష్‌, చిలమత్తూరు మండల కన్వీనర్‌ రంగారెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకుడు బాలాజీ, రామాంజినమ్మ, షఫీ, పరిమళ ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆస్పత్రిలో బాధితులను టీడీపీ నాయకులు నబీరసూల్‌, రాఘవేంద్ర, నవీన, రాఘవేంద్ర, హిదాయతుల్లా, బాచి, మంజునాథ్‌ పరామర్శించారు.



దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

టీడీపీ శ్రేణుల ఆందోళన

కొడికొండలో తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ వర్గీయులను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు చిలమత్తూరు బస్టాండులో ఆందోళనకు దిగారు. ప్రశాంతంగా ఉన్న వారిపై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడులు చేసి, తీవ్రంగా గాయపర్చడం దుర్మార్గమన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులకు లేపాక్షి ఎస్‌ఐ మునీర్‌ అహమ్మద్‌ సర్దిచెప్పి, ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు సురేంద్రయాదవ్‌, శ్రీదేవి, ప్రవీణ్‌, అశ్వత్థప్ప, శివప్ప, ఆదినారాయణప్ప, మల్లికార్జున, గంగప్ప, రామప్ప పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T06:07:20+05:30 IST