ప్రజా వ్యతిరేక పాలనలో వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-27T06:56:16+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

ప్రజా వ్యతిరేక పాలనలో వైసీపీ ప్రభుత్వం
వడ్డాదిలో జరిగిన ప్రజాపోరులో పాల్గొన్న బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ


బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ


బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 26: వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని  బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సోమవారం వడ్డాదిలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై చేపట్టిన ప్రజా పోరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్‌ పాలనలో పారిశ్రామిక, వ్యవసాయ తదితర రంగాలు కుదేలయ్యాయని విమర్శించారు. సీఎం జగన్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రాష్ట్ర ప్రజలను పెట్టుబడిగా పెట్టుకుని, రాష్ట్ర సంపదతో వ్యాపారం చేసుకుంటూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, సంస్థలను మూడున్నర పాలనలో సర్వనాశనం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లేదని, ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. రాష్ర్టానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. బటన్‌ నొక్కేస్తానంటూ ప్రజలను తాకట్టు పెట్టి సీఎం జగన్‌ లక్షల కోట్లు అప్పులు చేశారని లక్ష్మీనారాయణ ఆరోపించారు.  ఈ సందర్భంగా వడ్డాదికి చెందిన శిరిగిరిశెట్టి చినవెంకయ్యదొర, నాయుడుబాబు తదితర పది మంది బీజేపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి లక్ష్మీనారాయణ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం మే నెలలో దెబ్బతిన్న వడ్డాది వంతెనను లక్ష్మీనారాయణ పరిశీలించారు. వెంటనే నూతన వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గండి వెంకట సత్యనారాయణ, కార్యదర్శులు చదరం నాగేశ్వరరావు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీబీ.ఎస్‌.వర్మ, పట్టాబి ప్రసాద్‌, జోనల్‌ ఇన్‌చార్జి రవిరాజు, చోడవరం నియోజవర్గం కన్వీనర్‌ రమణమూర్తి, సీనియర్‌ నాయకులు రామరాజు, గల్లా రాజేశ్వర్‌, దూది రాజేష్‌, సీతా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-27T06:56:16+05:30 IST