వైసీపీ రచ్చ

ABN , First Publish Date - 2021-10-20T06:41:56+05:30 IST

వైసీపీ మహిళా నాయకులు మంగళవారం సాయంత్రం నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంపై దాడికి తెగబడ్డారు.

వైసీపీ రచ్చ
టీడీపీ కార్యాలయం వద్ద వైసీపీ మహిళా నేతలు, కార్యకర్తల ఆందోళన

టీడీపీ జిల్లా కార్యాలయంపై దాడికి తెగబడిన మహిళా నేతలు

రెండున్నర గంటలపాటు వీరంగం

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆందోళన

చంద్రబాబునాయుడు, ఇతర నేతలకు వ్యతిరేకంగా నినాదాలు

కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నం

అడ్డుకున్న ‘దేశం’ నాయకులు

ఇరువర్గాల నడుమ తోపులాట

ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో జోక్యం చేసుకున్న పోలీసులు

అప్పటివరకూ చోద్యం చూసిన వైనం


విశాఖపట్నం/మహారాణిపేట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): 

వైసీపీ మహిళా నాయకులు మంగళవారం సాయంత్రం నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. సుమారు 25 మంది రెండున్నర గంటలపాటు వీరంగం ఆడారు. కొందరు కార్యాలయం లోనికి వెళ్లేందుకు యత్నించగా, మరికొందరు చెప్పులతో ఎన్టీఆర్‌ విగ్రహం వైపు దూసుకువెళ్లారు. ఈ దశలో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు...వారిని అడ్డుకున్నారు.


వైసీపీ మహిళా నేతలు సాయంత్రం 4.30 గంటలసమయంలో పందిమెట్ట ప్రాంతంలో గల టీడీపీ కార్యాలయం గేటు తోసుకుని ఆవరణలో ప్రవేశించారు. ఆ సమయంలో పార్టీ కార్యాలయ సిబ్బంది నలుగురు మాత్రమే ఉన్నారు. పదుల సంఖ్యలో వచ్చిన మహిళలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయం తెలిసి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌తోపాటు మరికొందరు నాయకులు అక్కడకు చేరుకున్నారు. ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద వైసీపీ మహిళా నాయకులు ఆందోళన చేస్తున్నప్పటికీ...  ఉపేక్షించారు. అయితే...కొందరు మహిళలు మరింత రెచ్చిపోతూ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు యత్నించగా, మరికొందరు చెప్పులతో ఎన్‌టీఆర్‌ విగ్రహం దిమ్మెపైకి ఎక్కేందుకు యత్నించారు. దీంతో అప్పటివరకు సహనంతో చూసిన టీడీపీ నాయకులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వైసీపీ మహిళా నాయకులు, టీడీపీ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప.. వారిని అడ్డుకునేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. అదే సమయంలో టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అక్కడకు చేరుకున్నారు. కార్యాలయంలో ఆందోళన చేస్తున్న మహిళలను చూసి...రాజకీయపరమైన విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, ఈ విధంగా దాడికి పాల్పడడం మంచిది కాదని, వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ హితవు పలికారు. పల్లా మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మరింతగా రెచ్చిపోవడంతోపాటు టీడీపీ నాయకుల వైపు చొచ్చుకురావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో...అప్పటివరకు చోద్యం చూసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను అడ్డుకున్నారు. అప్పటివరకు కార్యాలయ ఆవరణలో ఆందోళన చేస్తున్న వైసీపీ మహిళా నాయకులను పట్టించుకోని పోలీసులు....ఈ ఘటన తరువాత వారిని బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. అయినప్పటికీ, వైసీపీ మహిళా నాయకులు కార్యాలయం బయట మరో గంట పాటు ఆందోళన నిర్వహించారు. టీడీపీ నాయకులు రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ దుర్భాషలు ఆడారు. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. పల్లా శ్రీనివాసరావును అరెస్టు చేయాలని, క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్‌ చేశారు.  


రెండున్నర గంటలపాటు.. 

టీడీపీ కార్యాలయంపై దాడి నిమిత్తం సాయంత్రం 4.30 గంటలకు వచ్చిన వైసీపీ మహిళ నాయకులు సుమారు రెండున్నర గంటలపాటు ఆందోళన చేపట్టారు. కార్యాలయ ఆవరణలో గంటపాటు, బయట మరో గంటన్నరపాటు నినాదాలు చేస్తూ బైఠాయించారు. టీడీపీ అధినేత, ఇతర ముఖ్య నాయకులను దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. పోలీసులపైనా పలువురు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


అనిత కారుపై దాడి

దాడి సమాచారం తెలిసి టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితను వైసీపీ మహిళా నేతలు అడ్డుకున్నారు. ఆమెను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు కారుపై దాడికి యత్నించారు. టీడీపీ కార్యాలయంపై దాడికి వచ్చిన వైసీపీ మహిళా నాయకుల్లో నగరాల కొర్పొరేషన్‌ చైర్మన్‌ పిల్లా సుజాత, రజక, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్లు యువశ్రీ, పద్మావతి, మాజీ కార్పొరేటర్‌ గుడ్ల రమణి, ఇటీవల పార్టీలో చేరిన  పేడాడ రమణికుమారి, పీలా వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు. 


హేయమైన చర్య

రాజకీయపరమైన విమర్శలను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప..దాడులకు తెగబడడం మంచి సంప్రదాయం కాదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివా సరావు విమర్శించారు. నీచ సంస్కృతికి వైసీపీ నాయకులు తెర లేపుతున్నారన్నారు. ఆర్థిక రాజధానిని చేస్తామని చెప్పిన వైసీపీ నాయకులు..ఇప్పుడు విశాఖను విష సంస్కృతులకు కేంద్రంగా మారుస్తున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయం వద్ద ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. సీపీకి, సీఐకి ముందుగానే సమాచారమిచ్చినా పట్టించుకోలేదన్నారు. పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ ఇంతటి దౌర్భాగ్యమైన సీఎం ను చూడలేదని, ఆడ వాళ్లను పంపించి రాజకీయాలు చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. కర్రకు కర్ర, దాడికి దాడి సమాధానమంటే తామూ సిద్ధమేనని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌, పార్టీ నాయకులు పుచ్చా విజయ్‌కుమార్‌, నజీర్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


పొటోలు టీడీపీ పేరుతో పొటో ఉంది

రైటప్‌: బుధవారం తలపెట్టిన బంద్‌ఏర్పాట్లుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు


బంద్‌కు సన్నద్ధం కండి

నేతలకు, కార్యకర్తలకు టీడీపీ విశాఖపట్నం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు

విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలు, నాయకుల నివాసాలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడడాన్ని నిరసిస్తూ పార్టీ అధిష్ఠానం బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాత్రి పార్టీ కార్యాలయంలో నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.  బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రతి నియోజకవర్గ పరిధిలో  నాయకులు బంద్‌ నిర్వహించాలన్నారు. వైసీపీ నేతల ఆగడాలను ప్రజలకు తెలియజేసి, బంద్‌కు వారి సహకారం తీసుకోవాలన్నారు. బంద్‌లో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎం.శ్రీభరత్‌, పాశర్ల ప్రసాద్‌, కోరాడ రాజబాబు, పీలా శ్రీనివాస్‌, పుచ్చా విజయకుమార్‌, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, బొండా జగన్‌, ఇంకా బండారు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 


పిరిపిందల చర్య

బుద్ద వెంకన్న, టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి

విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల నివాసాలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడడం పిరికిపందల చర్యగా టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. సమాచారం ఇచ్చి వుంటే టీడీపీ శ్రేణుల సత్తా చూపించి ఉండేవారమన్నారు. 


పార్టీ కార్యాలయంపై దాడులు అన్యాయం

విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులను ప్రోత్సహించడం అన్యాయమని, ఈ సంస్కృతి తగదని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. విశాఖలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ మహిళలు మంగళవారం రాత్రి చేసిన దాడిని ఆయన ఖండించారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వుంటే పార్టీపరంగా వాటిని ఖండించ వచ్చునని, ప్రతి విమర్శ చేయవచ్చునని, ఇలా నాయకుల ఇళ్లపైకి, పార్టీ కార్యాలయాలపైకి దాడులకు వెళ్లాల్సిందిగా చెప్పడం పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన అధికార పార్టీయే ఇలా చేయడం భావ్యంగా లేదని, మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు. 


వైసీపీ మహిళల దాడి హేయమైన చర్య

వెలగపూడి రామకృష్ణ, విశాఖ తూర్పు ఎమ్మెల్యే

టీడీపీ కార్యాలయంపై అధికార వైసీపీ మహిళలు దాడికి యత్నించడం హేయమైన చర్య అని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమన్నారు. కానీ రెండున్నరేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష పార్టీలకు చెందిన కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడడం ప్రారంభమైందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు ఇంకా పెరిగే అవకాశం వుందని, తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని వెలగపూడి కోరారు. 


భౌతిక దాడులు సమర్థనీయం కాదు

సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం

తెలుగుదేశం కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఈ దాడులను ఆపేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రిపై తెలుగుదేశం నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి వుంటే రాజకీయంగా ఎదుర్కొవాలి తప్ప ఈ రకంగా భౌతిక దాడులకు పూనుకోవడం సమర్థనీయం కాదన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని కోరారు.



Updated Date - 2021-10-20T06:41:56+05:30 IST