హిజాబ్ వివాదంపై తీర్పునిచ్చిన జడ్జీలకు Y కేటగిరి భద్రత

ABN , First Publish Date - 2022-03-20T20:58:42+05:30 IST

హిజాబ్ వివాదంపై తీర్పునిచ్చిన హైకోర్టు ధర్మాసనంలోని జడ్జీలకు భద్రత పెంచాలని కర్ణాటక ..

హిజాబ్ వివాదంపై తీర్పునిచ్చిన జడ్జీలకు Y కేటగిరి భద్రత

బెంగళూరు: హిజాబ్ వివాదంపై తీర్పునిచ్చిన హైకోర్టు ధర్మాసనంలోని జడ్జీలకు భద్రత పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులను హిజాబ్ ధరించేందుకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం ఇటీవల కొట్టివేసింది. దీంతో జడ్జీలను చంపుతామంటూ పొరుగున ఉన్న తమిళనాడు నుంచి బెదరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హిజాబ్ అంశంలో తీర్పునిచ్చిన హైకోర్టు జడ్జీలకు వై కేటగిరి భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


''తీర్పుతో ఎవరైనా సంతోషంగా లేనట్లయితే పైకోర్టులకు వెళ్లవచ్చు. దేశంలోని చట్టాలను బెదరించాలని చూసే సంఘ వ్యతిరేక శక్తులను మాత్రం సహించేది లేదు. ఇప్పటికే జడ్జీలకు భద్రతను కట్టుదిట్టం చేశాం. వారికి వై కేటగిరి భద్రత కల్పించాలని ఆదేశించాం'' అని ముఖ్యమంత్రి బొమ్మై అన్నారు. జడ్జీలకు హెచ్చరికలపై లిబరల్స్‌గా, సెక్యులరిస్టులుగా చెప్పుకునే వారు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. బెదరింపులకు పాల్పడిన నిందితులను కస్టడీలోకి తీసుకుని తదుపరి విచారణ కోసం కర్ణాటక తీసుకురావాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.


కాగా, హిజాబ్ వివాదంపై తీర్పునిచ్చిన కర్ణాటక హైకోర్టు జడ్జీలను చంపుతామంటూ బెదిరించిన ఇద్దరు వ్యక్తులను తమిళనాడులో కస్టడీలోకి తీసుకున్నారు. హిజాబ్ ధరించడం ముస్లిం మతాచారం కాదంటూ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ ఖాజి జైబున్నెసా మొయిహిద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.

Updated Date - 2022-03-20T20:58:42+05:30 IST