కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-07-16T14:15:41+05:30 IST

రాష్ట్రంలో కరోనాను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని..

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం 

మాజీ ఎమ్మెల్యే యరపతినేని 


పిడుగురాళ్ల(గుంటూరు): రాష్ట్రంలో కరోనాను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వల్ల ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారిందని క్వారంటైన్లలో ఉన్న బాధితులకు సరైన ఆహారం కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మూడుపూటల నాణ్యమైన ఆహారం అందించాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు కాంట్రాక్టర్ల అవతారమెత్తి నాసిరకం ఆహారాన్ని అందిస్తూ బాధితుల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


కంటైన్మెంట్‌ ఏరియాల్లో బార్‌కేడ్లు ఏర్పాటుచేసి ప్రజలపై ఆంక్షలు విధించి బయటకు రాకుండా చూస్తున్నారే తప్ప, వారు ఏవిధంగా జీవనం కొనసాగించాలో అర్థంకాక ఇబ్బందిపడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదన్నారు. గురజాల నియోజకవర్గంలోని కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రజలను ఆదుకోవటంలో అధికారులు చేతులెత్తేశారని యరపతినేని  తెలిపారు. కంటైన్మెంట్‌ జోన్లలోని కుటుంబాలకు మూణ్ణెల్లకు సరిపడ నిత్యావసరాలు, పిల్లలకు పాలు, కోడిగుడ్లు, మందులు ఉచితంగా ఇవ్వాలని, ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థికసాయం అందించాలని ఆయన కోరారు. అలాగే కరోనా బాధిత వ్యక్తులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి ఏడాదిపాటు ఉచితంగా నిత్యావసరాలు అందించాలని సూచించారు. కరోనా కట్టడి కోసం కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులు, రాష్ట్రంలో దాతలిచ్చిన నిధులు వేలకోట్ల రూపాయలను ఎవరికి ఖర్చుపెడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. 


వైసీపీ నాయకుల అక్రమ మైనింగ్‌ వల్లే...

తుమ్మలచెరువు గ్రామంలో వైసీపీ నాయకుల అక్రమ మైనింగ్‌ వల్లే ముగ్గురు, తంగెడ గ్రామంలో ఒక బాలుడు చనిపోయారని యరపతినేని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆయాప్రాంతాల్లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని, వర్షమొస్తే నీటిగుంతలా మారి విద్యార్థులకు ఏమైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. కరాలపాడు, జూలకల్లు, జానపాడు గ్రామాల్లోనూ మట్టి అక్రమతవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ అధికారులు మౌనం వహించటం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాల్సిన అవసరం ఉందని యరపతినేని తెలిపారు. 


Updated Date - 2020-07-16T14:15:41+05:30 IST