Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

గనులు.. ఘనులకే..

twitter-iconwatsapp-iconfb-icon
గనులు.. ఘనులకే..యడవల్లి భూములు

78 హెక్టార్లలో గ్రానైట్‌ నిక్షేపాలు

యడవల్లి భూములపై వైసీపీ పెద్దల కన్ను 

తొలుత ఎస్సీల నుంచి లాక్కొని ఏపీఎండీసీకి కేటాయింపు

కాంట్రాక్టర్ల ఎంపికకు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో బిడ్‌ల ఆహ్వానం

చిత్తూరు జిల్లా నేత తనయుడికి కాంట్రాక్ట్‌ వచ్చేలా నిబంధనలు


గుంటూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌కు ఆ భూములు నిలయం. తొలుత ఎస్సీల నుంచి ఆ భూములను లాక్కొన్నారు. అనంతరం ఏపీఎండీసీకి కేటాయించారు. ఆ భూమిలోని నల్ల బంగారం నిక్షేపాలను దక్కించుకునేందుకు వైసీపీ నేతలు రాజమార్గంలో చక్రం తిప్పుతున్నారు. ఇందుకు ప్రభుత్వ పెద్దలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని యడవల్లి గ్రామంలో 78 హెక్టార్ల విస్తీర్ణంలో భూములు బ్లాక్‌పెరల్‌ గ్రానైట్‌ నిక్షేపాలకు నిలయంగా ఉన్నాయి. రూ.వందల కోట్ల ఆదాయం తెచ్చి పెట్టే ఈ గనులను ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారానే రాజమార్గంలో కేటాయించే ప్రక్రియ చకచకా జరిగిపోతోన్నది. కొన్ని దశాబ్దాల క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో భూములను ప్రభుత్వం ఎస్సీలకు అసైన్‌మెంట్‌ చేసింది. వాటిల్లో కొన్ని సంవత్సరాల పాటు మెట్ట పంటలు సాగు చేసేవారు. ఆ తర్వాత భూములు పలువురు చేతులు మారాయి. దీనిపై జిల్లా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు నడిచాయి. గత ఏడాది కోర్టు కేసు పరిష్కారమైంది. ఇక్కడ మొత్తం 78.421 హెక్టార్ల భూమి ఉన్నది. ఇటీవలే కొంతమంది అసైన్‌మెంట్‌దారుల వారసులను ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారాన్ని చెల్లించి ఆ భూములను స్వాధీనం చేసుకుంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సరిపోదని, ఎకరానికి కనీసం రూ.కోటికి పైగా నష్టపరిహారం చెల్లించాలని వామపక్షాలు పోరాటం చేస్తోన్నాయి. భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వ్యవహారంలో వైసీపీ స్థానిక నేతలు తమ వంతు పాత్ర పోషించారు. 


గుట్టుచప్పుడు కాకుండా.. 

ఈ భూమిలో బ్లాక్‌పెరల్‌ కలర్‌ గ్రానైట్‌ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని శాటిలైట్‌ మ్యాప్‌ల ద్వారా గుర్తించారు. వాటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. ఈ భూములను ప్రభుత్వం ఇటీవలే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించింది. భూములపై అడ్డంకులు దాదాపుగా తొలగిపోవడంతో రెయిజింగ్‌-కమ్‌-సేల్‌ క్రాంటాక్ట్‌ ప్రాతిపదికన కేటాయించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఇంత పెద్ద టెండర్‌కు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్‌ని ఖరారు చేసే ప్రక్రియని ముందుకు తీసుకెళుతున్నారు. ఈ నెల రెండో వారంలోనే ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్‌ నోటిఫికేషన్‌ని అప్‌లోడ్‌ చేశారు. ఈ నెల 19 వరకు బిడ్డర్ల నుంచి ప్రీబిడ్‌ క్వరీస్‌ స్వీకరించారు. 20న విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయంలో ప్రీబిడ్‌ నిర్వహించారు. టెండర్‌ ఫీజుని రూ.5 లక్షలు(నాన్‌-రిఫండబుల్‌)గా నిర్ణయించింది. దీనికి రూ.90 వేల జీఎస్‌టీ అదనం. అలానే బిడ్‌ సెక్యూరిటీని రూ.3.50 కోట్లుగా పేర్కొన్నది. అక్టోబరు 4న సాయంత్రం 5 గంటల లోపు టెక్నికల్‌ బిడ్‌ని సమర్పించాలని తెలిపింది. అదే రోజు టెక్నికల్‌ బిడ్‌ని తెరుస్తామని పేర్కొన్నది. అక్టోబరు 7న టెక్నికల్‌ బిడ్‌లో అర్హత పొందిన కాంట్రాక్టర్ల పేర్లు ప్రకటిస్తామని తెలిపింది. 7న కమర్షియల్‌ బిడ్‌ ఓపెన్‌ చేస్తామని, అక్టోబరు 10న ఎంపికైన బిడ్డర్‌కి ఎల్‌వోఏ జారీ చేస్తామని ప్రకటించింది. పెర్‌ఫార్మెన్స్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ని రూ.9 కోట్లుగా పేర్కొన్నది. టెండర్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన నిబంధనలు పరిశీలిస్తే గ్రానైట్‌ రంగంలో పెద్దలకే ఉద్దేశించినట్లుగా ఉన్నది. సాధారణ కాంట్రాక్టర్లు ఎవరూ ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా బడా కాంట్రాక్టర్లకు కేటాయించేలా టెండర్‌ నిబంధనలను రూపొందించారు. ఏటా 500 క్యూబిక్‌ మీటర్ల(సీబీఎం) ముడి బ్లాక్‌లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలన్నీ పరిగణనలోకి తీసుకుంటే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ బడా వైసీపీ నేత తనయుడికి చెందిన సంస్థకే మొత్తం కాంట్రాక్టు వచ్చేలా ఉందని జిల్లాలోని మైనింగ్‌ కాంట్రాక్టర్లలో చర్చ జరుగుతోన్నది. వడ్డించే వాడే మనవాడైతే అన్న... చందంగా అన్ని అనుమతులు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతోన్నట్లు సమాచారం. అన్నీ సవ్యంగా జరిగితే నెల వ్యవధిలోనే ఈ బంగారు బాతు వైసీపీ పెద్దలవశం కావడం ఖాయంగా కనిపిస్తోన్నది. మొత్తం 20 ఏళ్ల పాటు ఈ లీజుని కేటాయించనున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఇది మరో ఓబులాపురం మైనింగ్‌లా మారుతుందన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమౌతోన్నాయి. 

  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.