హామీలకే పరిమితం!

ABN , First Publish Date - 2022-06-04T05:02:16+05:30 IST

పంట రుణం తీసుకున్న రైతులకు మాఫీ డబ్బుల కోసం

హామీలకే పరిమితం!

  • రుణమాఫీ కోసం రైతులకు తప్పని నిరీక్షణ
  • రూ.25 వేల, 50 వేల లోపు వారికే అమలు 
  • 50 వేల పైన, లక్షలోపు వారి సంగతేంటి?
  • రుణమాఫీ చేసినా వడ్డీకే సరిపోయే అవకాశం 
  • లక్షన్నర రైతులకు పైగా ఎదురుచూపులు
  • కనీసం అర్హుల లెక్కలు కూడా లేని వైనం


రంగారెడ్డి ఆర్బన్‌, జూన్‌ 3 : పంట రుణం తీసుకున్న రైతులకు మాఫీ డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రూ. లక్ష లోపు రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రభుత్వం ప్రకటించినా.. పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికి రూ.25 వేలు, రూ.50 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ అమలు చేశారు. జిల్లాలో మొదటి విడతలో 17,943 మంది రైతులు 25 వేలలోపు రుణాలు తీసుకున్నారు. అందులో 10,928 మంది రైతులకు రూ.16.73 కోట్లు రుణమాఫీ చేశారు. ఇంకా ఈ విడతలో 7,015 మంది రైతులు మిగిలిపోయారు. రూ.50 వేల పైన, రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏటా వానాకాలం సాగు సమయంలో రైతులు పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకోగా మాఫీ అవుతుందనే ఆశతో చాల మంది రైతులు రుణాలను చెల్లించకుండా ఎదురు చూస్తున్నారు. 2018, డిసెంబర్‌ 11 నాటికి ఉన్న పంట బకాయిలను రూ. లక్ష వరకు మాపీ చేయనున్నట్లు 2002, మార్చిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది విడతల వారీగా అంటే మొదట రూ.25 వేల లోపు తీసుకున్న రైతులందరికి ఒకే సారి తొలి విడతలో చెల్లించేందుకు నిర్ణయించగా .. ఆ తర్వాత రూ.50 వేలు, ఆపై 75వేలు, చివరన లక్షలోపు తీసుకున్న వారికి ఇలా నాలుగు వాయిదాల్లో రుణమాపీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రూ. 25 వేలు వరకు తీసుకున్న రైతుల రుణం మాఫీ చేశారు. రూ.50 వేల లోపు తీసుకున్న రైతులకు సంబంధించిన రుణాలను గతేడాది ఆగస్టు 16 నుంచి 31లోపు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందులో అందరికి కాకుండా కొందరు రైతులు మాత్రమే రుణమాఫీ డబ్బులు వారి ఖాతల్లో జమ అయ్యాయి. కేవలం రూ.30 వేలు రుణం ఉన్న రైతులకు మాత్రమే మాపీ అయినట్లు తెలుస్తోంది. మిగతా వారికి ఇప్పటి వరకు కాలేదు. ఇందుకు సంబంధించి కారణాలు ఎవరూ చెప్పడం లేదు. 

 

పంట రుణాల కోసం తిప్పలు..

వేసవి దుక్కులు దున్ని వానకాలం పంటకు సిద్దమవుతున్న రైతులు పెట్టుబడుల కోసం ఎదరుచేస్తున్నారు. సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. రైతు బంధు కింద ఎకరానికి రూ.5 వేలు వచ్చినప్పటికీ అవి ఏమూలకు సరిపోని పరిస్థితి. లక్షలోపు రుణణం తీసుకుని రిన్యూవల్‌ చేయించుకోని రైతులకు తిరిగి రుణం ఇవ్వడం లేదు. రైతు బంధు డబ్బులు బ్యాంకర్లు వడ్డీ కింద ఉంచేసుకుంటున్నారు.  యాసంగిలో పండించిన ధాన్యం అమ్మిన డ్బులు కూడా సకాలంలో అందకపోవడంతో దున్నకాలు, విత్తనాలు, ఎరువులు, కూలీలకు అవసరమైన మొత్తనాకి ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని పలువురు రైతులు రెండు మూడేళ్ల నుంచి రుణాలను రిన్యూవల్‌ చేయించుకోలేదు. గత వానాకాలం సీజన్‌ వరకు మాఫీ కాకపోవడంతో రుణాలను ఇలాంటి రైతులను బ్యాంకు అధికారులు గుర్తించారు. వారి సేవింగ్‌ అకౌంట్ల ఆర్థిక వ్యవహారాలను నిలుపుదల చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో తీసుకున్న రుణంపై వడ్డీ మీద వడ్డీ కట్టి పునరుద్దరించుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు మాఫీపై ఆశతో చెల్లించకుండా ఎదురు చూస్తున్నారు. ఫలితంగా వడ్డీ చక్రంలో నలిగిపోతున్నారు. 


రుణమాఫీ అర్హుల లెక్కలేవి?

జిల్లా వ్యాప్తంగా రూ. లక్షలోపురుణమాఫీకి అర్హులైన వారి జాబితాకు సంబంధించిన వివరాలు జిల్లా వ్యవసాయాధికారి వద్ద లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. అర్హుల జాబితా ఇవ్వాలని కోరితే తమ వద్ద లేదని చెప్పడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన జాబితా వివరాలను  వ్యవసాయశాఖ వద్ద ఉండాల్సిన అవసరం ఉంది. కానీ లేకపోవడం గమనార్హం.


అసలు కంటే... వడ్డీ ఎక్కువైంది

రైతు పేరు ఒగ్గి అంజయ్య, చేగిరెడ్డి ఘనాపూర్‌ గ్రామం, చౌదరిగూడ మండలం. అతనికి రెండెకరాల పొలం ఉంది. ప్రతీ ఏటా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం పంట పెట్టుబడి కోసం కొందుర్గు మండలం, రామచంద్రాపురం ఐసీఐసీఐ బ్యాంకులో లక్ష రూపాయలు పంట రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణంపై ఇప్పటివరకు రెండుసార్లు రిన్యువల్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఒకసారి రూ.23 వేలు చెల్లించగా మరోసారి రూ. 17 వేలు చెల్లించాడు. ఇంకా రూ.90వేలు చెల్లించాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఆ రైతు తీసుకున్న పంట రుణం లక్ష రూపాయలు కాగా .. ఆ రుణంపై పేరుకుపోయిన వడ్డీ రూ. 1,30,000 అయ్యింది. అసలు, వడ్డీ కలిపి ఇంకా ఆ  రైతు రూ. 2.30 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం రుణ మాఫీ చేసినా.. ఆ రైతు ఇంకా రూ.90 వేల భారం ఉండిపోతుంది. అతను వడ్డీ అనే చక్ర బంధనంలో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఈసారి యాసంగిలో ఎకరంన్నర విస్తీర్ణంలో వరి సాగు చేశాడు. 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. కానీ.. ఇప్పటివరకు ఇంకా డబ్బులు రాలేవు. వానాకాలం పంటకు దుక్కులు దున్ని సర్వం సిద్ధం చేశాడు. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. వందకు మూడు రూపాయల వడ్డీతో రూ.50 వేలు కావాలని అభ్యర్థిస్తున్నాడు. 


రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నా

గత మూడేళ్ల క్రితం చేవెళ్లలోని హెచ్‌బీహెచ్‌ గత మూడేళ్లుగా రుణమాపీ కోసం ఎదురు చేస్తున్నాను. ప్రభుత్వం మాఫీ చేస్తుందని బ్యాంకు వాళ్లు చెబుతున్నారు. పంట పెట్టుబడి కోసం రూ. 45 వేలు చేవెళ్లలోని ఎస్‌బీఐలో రుణం తీసుకున్నాను. ప్రతీ ఏటా రిన్యూవల్‌ చేయిస్తున్నాను. ఇప్పటి వరకు రూ. 20 వేల వరకు వడ్డి చెల్లించాను. ప్రభుత్వం 50 వేల లోపు రైతులకు రుణ మాఫీ చేసిందని చెబుతుంది.. కానీ.. నాకు ఇంకా రుణ మాపీ కాలేదు. రుణమాపీ కోసం ఎదరు చూస్తున్నాను. 

- శ్రీశైలం, రామన్నగూడ రైతు, చేవెళ్ల మండలం


ఏప్రిల్‌ ఒకటో తేది నుంచి 2018 డిసెంబర్‌ 11 లోపు రుణం తీసుకున్న రైతులకు, కుటుంబానికి లక్ష రూపాయల వడ్డీతో కలుపుకుని నాలుగు విడతల్లో రుణమాఫీ జరుగుతుంది. ఇప్పటివరకు రెండు విడతల్లో రుణమాఫీ జరిగింది

పంట రుణమాఫీ వివరాలు

విడత : మొదటి విడత (25,000లోపు) రెండో విడత(50,000లోపు)

రైతులు : 10,940మంది 24,013మంది

రుణమాఫీ : రూ.16.73 కోట్లు రూ.82.49 కోట్లు


Updated Date - 2022-06-04T05:02:16+05:30 IST