తల్లిపాల విలువను తెలుసుకోవాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-07T05:22:39+05:30 IST

అమృతతుల్యమైన తల్లిపాల విలువను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

తల్లిపాల విలువను తెలుసుకోవాలి : కలెక్టర్‌
వీరవాసరంలో ప్రతిజ్ఞ చేస్తున్న ఏఎన్‌ఎంలు

భీమవరం టౌన్‌, ఆగస్టు 6 : అమృతతుల్యమైన తల్లిపాల విలువను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. శనివారం మునిసిపల్‌ సమావేశ మందిరంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆమె మాట్లాడుతూ తల్లి పాల ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. భవిష్యత్తును నిర్ధేశించే ఆరోగ్యవంతమైన యువత తల్లి పాల ద్వారానే సాధ్యమన్నారు. గతంలో తాను స్ర్తీ శిశుసంక్షేమ శాఖలో పీడీగా చేసిన కాలంలో తల్లీబిడ్డలకు ఎన్నో ప్రయోజనకరమైన కార్యక్రమాలను రూపొందించానన్నారు. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.సుజాతరాణి  మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వడంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో బాలునాయక్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి దేవ సుధా, మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ చేతుల మీదుగా గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. పౌష్టిక ఆహార కిట్లను అందించారు. తొలుత అంగన్‌వాడీలు తయారు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శనను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీడీపీవోలు బి.వాణి విజయరత్నం, కె. మేరి, ఎలిజిబెత్‌, సీహెచ్‌ ఇందిర, సీహెచ్‌ సుజాత పాల్గొన్నారు. 

వీరవాసరం, ఆగస్టు 6 : ‘ఆరోగ్య కార్యకర్తగా నేను హాజరైయ్యే ప్రతీ కాన్పులో తల్లి ప్రసవించిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆరోగ్యంగా ఉన్న ప్రతీ నవజాత శిశువుకు మొదటి గంటలో ముర్రుపాలు తాగేలా ప్రయత్నం చేస్తానంటూ’ అని ఏఎన్‌ఎం, ఆశా వలంటీర్లు ప్రతిజ్ఞ చేశారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం వీరవాసరం పీహెచ్‌సీ పరిధిలోని వీరవల్లివారిపాలెం, శృంగవృక్షం గ్రామాల్లో గర్భిణులు, బాలింతలతో సమావేశం నిర్వహించారు. సీహెచ్‌వో దేవదాసు, పీహెచ్‌ఎన్‌ కె.రాహేలమ్మ, జీవీవీ సత్యనారాయణ, వి.దుర్గారావు, సీహెచ్‌ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. 

పెనుమంట్ర, ఆగస్టు 6 : పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ద్వారా బిడ్డలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంగన్‌వాడీ కార్యకర్త వి.కామేశ్వరి అన్నారు. మల్లిపూడిలో శనివారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వ హించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. బాలింతలు, గర్భిణులు పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత ను అధిగమించవచ్చన్నారు. కరుణశ్రీ, సుజయ్‌ కుమారి, శిరీష, ప్రశాంతి, మేరి, సుమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T05:22:39+05:30 IST