Abn logo
May 23 2020 @ 04:07AM

కరోనా కాటేసింది...సొంతూళ్లకు పొమ్మంది!

ఉపాధి లేక వెళ్లిపోతున్న శ్రామికులు

స్తంభించనున్న సమస్త రంగాలు

ఆదిలోనే రెండో పంటకు గడ్డు పరిస్థితులు

3 లక్షల ఎకరాల్లో వరి సాగు కష్టమే!

పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం

సడలింపులు ఉన్నా ఉత్పత్తులు అంతంతే!

భవన నిర్మాణాలకూ బ్రేక్‌

కూలీల కొరతతో అప్పుడే ధరకు రెక్కలు

హోటల్‌ రంగానికీ తప్పదు సంక్షోభం

భయం గొలుపుతున్న లాక్‌డౌన్‌ తదనంతరం


నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

అన్ని రంగాల్లో సర్వం తామై శ్రమ ఫలాలు పంచిన వలస శ్రామికులు జిల్లాను వీడుతున్నారు. కడుపాత్రం కోసం ఉన్న ఊరును.. కన్నవారిని వదిలి ఇక్కడకు వచ్చిన వేలాది మంది కరోనా పుణ్యమా అని ఉపాధిలేక సొంతవారిని కలుసుకోవాలనే బెంగతో రకరకాల మార్గాల్లో పయనమవుతున్నారు. ఇటు వలస కార్మికులు వెళుతున్నారో లేదో అప్పుడే జిల్లా పరిధిలోని పలు రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రెండోపంటకు నీరిచ్చినా.. నారేతలకు కూలీలు  దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు లభించినా  పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభించలేని దయనీయ స్థితి. భవన నిర్మాణ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఎదురవుతోంది. రేపో.. ఎల్లుండో హోటళ్లు నడుపుకోవడానికి అనుమతులు లభించినా వండిపెట్టే వారూ కరువయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇలా రైసు మిల్లుల నుంచి ఇటుక బట్టీల వరకు అన్నింటి భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెట్టేసి శ్రమ సౌందర్యం వెళ్లిపోతోంది. 


పారిశ్రామికవాడగా గుర్తింపు పొందిన శ్రీసిటీలో ఉత్పత్తులతోపాటు విస్తరణ పనులకు బ్రేక్‌ పడుతోంది. శ్రీసిటీ పరిధిలో భవన నిర్మాణ రంగంలో పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులు సుమారు 3వేల మందికి పైగా పని చేస్తున్నారు. వీరంతా సొంత ఊళ్లకు వెళ్లడంతో విస్తరణ పనులు స్తంభించిపోయాయి. తడ మండల పరిధిలోని వీకేసీ, నిప్పో, పెనాసోనిక్‌, మెడిమిక్స్‌, దాల్మియా తదితర పరిశ్రమల నుంచి ఇప్పటికే 1500 మందికిపైగా సొంత రాష్ట్రాలకు తరలివెళ్లగా, మరో 1500 మందికిపైగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఎత్తులో పని చేయగలిగే సామర్థ్యం కలిగిన కేరళ శ్రామికులూ వెళ్లిపోవడంతో సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో రియల్‌ రంగం స్తంభించింది. జిల్లాలో మరో ప్రధాన వాణిజ్య కేంద్రం కృష్ణపట్నం పోర్టులో కూలీల కొరత  కారణంగా సరుకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమస్య మొదలవుతోంది.


ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన శ్రామికులు సొంత గడ్డకు తరలివెళ్లడంతో కృష్ణపట్నం పారిశ్రామికవాడ పరిధిలోని థరల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 8500 మంది పరిశ్రమల్లో పని చేస్తున్నారు. యూపీ నుంచి 2700, ఒడిశా 1400, బీహార్‌ 2400, జార్కండ్‌ 1600 మంది, పక్క జిల్లాలకు చెందిన వారు 1600 మంది తమ ప్రాంతాలకు వెళ్లడం కోసం అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. రిజిష్టర్‌ చేసుకోకుండా నడిచి వెళ్లిన వారు ఇంతకు రెండింతల మంది ఉంటారు. అంటే సుమారు 25వేల మంది పక్క రాష్ట్రాలు, జిల్లాకు చెందిన వారు పరిశ్రమల్లో పని చేస్తున్నారు. మిషన్‌ ఆపరేటింగ్‌ నుంచి లేబర్‌ వరకు అన్ని పనుల్లో వీరే కీలకం. ఒక్కసారిగా ఇంత మంది పనులు వదిలేసి సొంత ఊళ్లకు దారిపడితే పరిశ్రమల్లో ఉత్పత్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 


నీరున్నా వరినాట్లు పడేనా!?

జిల్లాలో రెండో పంటకు నీరు వదిలారు. సమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతులు విత్తనాలు చల్లారు. ఇప్పుడిప్పుడే నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. అయితే 3లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందా అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. జిల్లాలో వరి సాగు కావాలంటే పక్క జిల్లాకు చెందిన కూలీల సహకారం కావాల్సిందే. ప్రతి సంవత్సరం రబీ, ఖరీఫ్‌ సీజన్లలో శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వేలాది మంది కూలీలు జిల్లాలో వరి నాట్ల కోసం వస్తారు. కుటుంబాలతో సహా తరలివచ్చే వీరంతా గ్రామాల్లో గుడారాలు వేసుకొని రెండు నెలల పాటు ఇక్కడే ఉండి నాట్లు పూర్తయ్యాక స్వగ్రామాలకు వెళ్లిపోతారు. అయితే ఈ సీజన్‌లో వీళ్లు జిల్లాకు వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో 3లక్షల ఎకరాల్లో వరి సాగు సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 


పలు రంగాలపై ప్రభావం

భవన నిర్మాణ రంగంలో శ్రీకాకుళం జిల్లావాసుల పాత్ర కీలకం. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. మొన్నటివరకు ఇసుక కొరత కారణంగా పని దొరకలేదు. నెలల తరబడి పస్తులతో బతకలేక చాలా మంది సొంత జిల్లాలకు వెళ్లిపోయారు. ఆ తరువాత కరోనా ప్రభావంతో రెండు నెలలు పనులు లేవు. ఇప్పుడు పనులున్నా చేయడానికి వీరు సిద్ధంగా లేరు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు కాలినడకన సొంత ఊర్లకు వెళ్లిపోయారు. వీరు లేని ప్రభావం అప్పడే కనిపిస్తోంది. కూలీల ధరలు పెరిగిపోయాయి. కరోనాకు ముందు కూలి రేటు 500 అయితే ఇప్పుడు 700 రూపాయలకు పెరిగింది. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇసుక కొరత కారణంగా ఏడాది కాలంగా స్తంభించిన నిర్మాణ రంగం ఇకపై కూలీల కొరత కారణంగా కుదేలవనుంది. ఇటుకల ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి.


నెల్లూరురూరల్‌, బుచ్చి, ఉదయగిరి ప్రాంతాల్లో  ఎక్కువగా ఉన్న ఇటుక బట్టీలలో శ్రామికులందరూ బయటి ప్రాంతాలకు చెందినవారే. ఏదోవిధంగా వీరంతా సొంత ఊర్లకు పయనమయ్యారు. కొత్తగా రాయి కోయడం లేదు. ఉన్న రాయిని మాత్రం అమ్ముతున్నారు. భవిష్యత్తులో ఇటుక ధరలు సగటు మనిషి తల బద్దలు కొడుతుందనడానికి ఇది ఒక సంకేతం మాత్రమే. రైస్‌మిల్లులు మూతపడే ప్రమాదం లేకపోలేదు. వీటిలో పనిచేసే శ్రామికులంతా శ్రీకాకుళం, విశాఖ తదితర జిల్లాలకు చెందిన వారే. లోడింగ్‌, అన్‌లోడింగ్‌, మిల్లింగ్‌ పనుల్లో వీరే కీలకం. వీరంతా ఊరెళ్లిపోతున్నారు. ఇప్పుడు నిల్వ ఉన్న బియ్యం అమ్మకాలు జరిగే వరకు భయం లేదు. ఇకపై మిల్లింగ్‌ జరగడమే కష్టం. ఈ ప్రభావం అటు తిరిగి, ఇటు తిరిగి ప్రజల మీదే పడుతుంది. హోటళ్ల రంగం సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. కొద్ది రోజుల వ్యవధిలో హోటళ్లు తెరుచుకోవడానికి అనుమతి లభించినా, తిండి తయారు చేయడానికి మనుషులు ఉండని పరిస్థితి. ఈ రంగంలో పనిచేసే శ్రామికుల్లో 90 శాతం పక్క రాష్ట్రాలకు చెందిన వారే. ఇప్పటికే వీరిలో చాలా మంది వెళ్లిపోయారు. 


లాక్‌డౌన్‌ తదనంతరం

లాక్‌డౌన్‌ తదనంతర పరిణామాలు భయం గొలుపుతున్నాయి. లాక్‌డౌన్‌ ఎందుకు ఎత్తేశారు భగవంతుడా అని సగటు మనిషి మదనపడే రోజులు రానున్నాయి. వలస కూలీలు వెళ్లిపోవడంతో స్థానికంగానే ఆధారపడాల్సి వస్తుంది. స్కిల్డ్‌ లేబర్‌ లేని కారణంగా పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకోవడం, కొన్ని యూనిట్లను మూసివేయడం తప్పనిసరవుతుంది. దానివల్ల స్థానికులైన అన్‌ స్కిల్డ్‌ లేబర్‌ ఉపాధిని కోల్పోతారు. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. శ్రామికుల కొరత కారణంగా అన్ని రంగాల్లో కూలీల రేట్లు పెరుగుతాయి. ఆ ప్రభావం ధరలపై పడుతుంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. ఇప్పటికే ధాన్యం, పప్పుల ధరలు పెరిగాయి. రాబోయే రెండు నెలల్లో మరింత పెరగనున్నాయి. కరోనా కారణంగా రెండు నెలల పాటు ఆదాయాన్ని కోల్పోయి బక్కచిక్కిన సగటు మనిషికి ధరల భారం పిడుగుపాటే కాబోతోంది. 

Advertisement
Advertisement
Advertisement