క్లౌడ్‌తో సాఫీగా..!

ABN , First Publish Date - 2020-05-02T05:44:32+05:30 IST

నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా... వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌... పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాలు.... లాక్‌డౌన్‌ సమయంలో అందరూ ఏదో రకంగా బిజీగా గడుపుతున్నారు. ఇంట్లో సినిమాలు చూస్తున్నారు.

క్లౌడ్‌తో సాఫీగా..!

నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా... వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌... పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాలు.... లాక్‌డౌన్‌ సమయంలో అందరూ ఏదో రకంగా బిజీగా గడుపుతున్నారు. ఇంట్లో సినిమాలు చూస్తున్నారు. ఇంట్లో నుంచే కంపెనీల ప్రాజెక్టు పనులు సాగిపోతున్నాయి. పిల్లలు ఇంట్లోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే క్లౌడ్‌కంప్యూటింగ్‌ కారణం. ఇంతకీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? ఆ విశేషాలు ఇవి..


క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ప్రధానంగా మూడు రకాల సర్వీసులు ఉంటాయి. ‘సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’. దీన్నే ‘సాస్‌’ అంటారు. క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే వెబ్‌ అప్లికేషన్‌లను దీని ద్వారా అందించవచ్చు. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365, డ్రాప్‌బాక్స్‌, జీసూట్‌ వంటి వాటిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక కంప్యూటర్‌లో లేదా మొబైల్‌లో ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన పని లేకుండా నేరుగా బ్రౌజర్‌ ద్వారా, ప్రత్యేకమైన క్లయింట్‌ అప్లికేషన్‌ ద్వారా అన్ని రకాల పనులను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవటానికి ఈ టెక్నాలజీ వెసులుబాటు కల్పిస్తుంది. ఉదాహరణకు ఒక కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే కొంత స్థలం ఉండటంతోపాటు, కేవలం ఆ ఒక్క కంప్యూటర్లో మాత్రమే వాడడానికి వీలు అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మీకు మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365 సబ్‌స్ర్కిప్షన్‌ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడనుండైనా, ఏ డివైజ్‌ నుండైనా మీ అకౌంట్లోకి లాగిన్‌ అయి కొత్త డాక్యుమెంట్లను క్రియేట్‌ చేసుకోవచ్చు, షేర్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ లాంటివి కూడా! ఎక్కడ మీ ఇంట్లో ఆఫ్‌ చెయ్యబడి ఉన్న కంప్యూటర్లో ముఖ్యమైన డేటా ఉంటే ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అలా కాకుండా అతి ముఖ్యమైన మీ ఫైళ్ళన్నీ గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ అమెజాన్‌ స్టోరేజ్‌ సర్వీసులలో సేవ్‌ చెయ్యబడి ఉంటే ఎక్కడ నుండైనా వాటిని కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో వాడుకోవచ్చు.


సినిమాలు, పాటలు...

మనం చూస్తున్న యూట్యూబ్‌ వీడియోలు, అమెజాన్‌ పైరమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటివన్నీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి ఉదాహరణలు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇంటర్నెట్లో వెతికి పట్టుకొని ఎంపీ3 పాటలు, సినిమాలూ చాలామంది డౌన్‌లోడ్‌ చేసుకొనే వారు. అలాంటి పరిస్థితుల నుండి స్పాటిఫై, జియో సావన్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి వాటిలో కావలసిన పాటలు, సినిమాలు ఎప్పటికప్పుడు స్ట్రీమ్‌ చేసుకోగలుగుతున్నామంటే ఆ కంటెంట్‌ మొత్తం క్లౌడ్‌లో ఆయా సర్వీసుల దగ్గర స్టోర్‌ చెయ్యబడి ఉండడమే. వాళ్లు కేవలం ఒక అప్లికేషన్‌ డెవలప్‌ చేసి మన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే, తగిన సబ్‌స్ర్కిప్షన్‌ కలిగి ఉంటే అన్ని రకాల కంటెంట్‌ యాక్సెస్‌ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అంటే మన ఫోన్లో ఎంత తక్కువ స్టోరేజ్‌ ఉన్నా మనకు నచ్చిన సినిమాలన్నీ చూడగలుగుతున్నాం.


మౌలిక సదుపాయాలు!

కేవలం సాఫ్ట్‌వేర్‌ మాత్రమే కాదు, మౌలిక సదుపాయాలు కూడా ఒక సర్వీ్‌సగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో లభిస్తాయి. దీన్నే ‘ఐయాస్‌’ అంటారు. ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ అనే పదానికి సంక్షిప్త రూపం ఇది. ఒక పూర్తి స్థాయి కంప్యూటింగ్‌ వనరులను క్లౌడ్‌లో కల్పిస్తారు. ఉదాహరణకు మీకు ఒక శక్తివంతమైన ప్రాసెసర్‌, భారీ మొత్తంలో స్టోరేజ్‌, తగినంత ర్యామ్‌ కలిగి ఉన్న కంప్యూటర్‌ కావాలనుకోండి. దాన్ని విడిగా కొనాల్సిన పని లేకుండా, కొంత మొత్తాన్ని చెల్లిస్తే అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, మైక్రోసాఫ్ట్‌ అజూర్‌, గూగుల్‌ కంప్యూటర్‌ ఇంజిన్‌ వంటి సంస్థలు మీకు కావలసిన స్పెసిఫికేషన్స్‌తో ఒక సిస్టమ్‌ సిద్ధం చేసి అందిస్తాయి. సరిగ్గా ఇలాంటి టెక్నాలజీనే ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ అంటారు. వీటితోపాటు ఏకంగా కావలసిన ఆపరేటింగ్‌ సిస్టం, వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ మొత్తం సిద్ధంగా పెట్టి ‘డెస్క్‌టాప్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ అనేది కూడా అందిస్తున్నారు. అమెజాన్‌ వర్క్‌ స్పేసేస్‌ ఈ కోవకు చెందుతుంది. గతంలో చాలా కంపెనీలు వాటి బ్రాంచ్‌లతో  వర్చ్యువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ద్వారా కనెక్ట్‌ అయ్యేవి. దీంట్లో అనేక రకాల సెక్యూరిటీ సమస్యలు ఉండటం వలన ఇప్పుడు అనేక ఐటీ కంపెనీలు ‘డెస్క్‌టాప్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఒక సామాన్యుడికి ఇవన్నీ అర్థం కాకపోయినా, అనునిత్యం మనం వాడుతున్న క్లౌడ్‌ సేవలన్నీ వీటి ద్వారా పొందుతున్నవే.




కొంచెం జాగ్రత్త!

కంపెనీలుగానీ, వ్యక్తులు గానీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో లాభాలు మాత్రమే కాదు, అనేక నష్టాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనది సెక్యూరిటీ. మీ గూగుల్‌ అకౌంట్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను ఎవరైనా హ్యాకర్లు దొంగిలిస్తే చాలు, క్లౌడ్‌లో మీరు స్టోర్‌ చేసుకున్న ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలు వంటివన్నీ చాలా సులభంగా వాళ్ల చేతుల్లోకి వెళతాయి. చిన్న ఉదాహరణ.. గూగుల్‌ ఫొటోస్‌ అనే క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసునే తీసుకుంటే, పలువురు హాలీవుడ్‌ సెలబ్రిటీల గూగుల్‌ అకౌంట్లని హ్యాక్‌ చేసి వారి వ్యక్తిగత ఫొటోలు దొంగిలించిన సందర్భాలు అనేకం. స్టోరేజ్‌ కోసం గానీ, లేదా ఆఫీ్‌సకి కనెక్ట్‌ కావడం కోసం గానీ మీరు ఉపయోగించే క్లౌడ్‌ అకౌంట్లని ఏదో పద్ధతిలో చేజిక్కించుకుంటే ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ సెక్యూరిటీ సెట్టింగ్స్‌ వాడాలి. ఇకపోతే క్లౌడ్‌ సర్వీసులను మనకు అందించే కంపెనీలు ఎంతవరకు సురక్షితమైనవో, ఎంతకాలం మన డేటాని రక్షిస్తాయో చెప్పలేం. గతంలో మూతబడిన అనేక క్లౌడ్‌ సర్వీసులు దీనికి మంచి ఉదాహరణ. కాబట్టి క్లౌడ్‌ సర్వీసుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


కంప్యూటర్‌లో లేదా మొబైల్‌లో ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన పని లేకుండా, అన్ని రకాల పనులను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవటానికి ఈ టెక్నాలజీ వెసులుబాటు కల్పిస్తుంది.





నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-05-02T05:44:32+05:30 IST