వర్క్‌.. హోం.. హ్యాపీ

ABN , First Publish Date - 2021-08-15T05:04:51+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ విప్లవం వచ్చినప్పటి నుంచి దానిని అందిపుచ్చుకోవడంలో జిల్లా వాసులు ముందే ఉన్నారు. పెద్దసంఖ్యలో వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగులు చేస్తున్నారు.

వర్క్‌.. హోం.. హ్యాపీ

కరోనాతో మారిన వాతావరణం

అనేక వ్యాపారాలకు ఊతంగా వర్క్‌ఫ్రం హోం

35 వేల మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇళ్ల నుంచే పని


  

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. మెట్రోల నుంచి గ్రామాల బాట పట్టింది. వెలుగు జిలుగుల మధ్య ఆకాశ హార్మ్యాల నుంచి ఇంటి గడప తొక్కింది. కంప్యూటరే లోకంగా.. కీ బోర్డు మీటలతోనే మాటలుగా గడిపిన యువత తల్లిదండ్రుల పంచన చేరింది. రణగొణ ధ్వనులు.. కాలుష్య కాసారాల నుంచి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ.. పచ్చని వాతావరణం మధ్య.. ఇంటి పట్టుకు చేరింది. కాలంతో సంబంధం లేకుండా.. ఒంటరిగా ఉన్న వారు ప్రస్తుతం కుటుంబసభ్యుల గారాల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద కరోనా ఎందరినో కకావికలం చేయగా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను ఇంటికి చేర్చింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులపై ఆధారపడి నగరాల్లో నిగనిగలాడిన వ్యాపారం జిల్లా కేంద్రాలకు.. పట్టణ ప్రాంతాలకు మారింది. 


గుంటూరు(సంగడిగుంట), ఆగస్టు 14: సాఫ్ట్‌వేర్‌ విప్లవం వచ్చినప్పటి నుంచి దానిని అందిపుచ్చుకోవడంలో జిల్లా వాసులు ముందే ఉన్నారు. పెద్దసంఖ్యలో వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగులు చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉండేవారు.   తీవ్రమైన ఒత్తిడిలో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు. కుటుంబాలతో గడిపే సమయం కూడా తక్కువగా ఉండేది. కరోనాతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. కరోనా వైరస్‌ విజృంభణతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం కల్పించాయి. అయితే మొదట కొన్ని నెలలే అని ప్రకటించాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులు మెట్రో నగరాలను వదిలి స్వగ్రామాలకు వచ్చేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా కుటుంబాలతో గడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్నేహితులతో గడపుతున్నారు. గతంలో కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందుతున్నారు. దీంతో ఆనందంగా పని చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌నే కోరుకుంటున్నారు.


వ్యాపారం.. కళకళ

2020లో కరోనా లాక్‌డౌన్‌తో జిల్లాలోని వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో అనుకోని అదృష్టంలా వర్క్‌ ఫ్రమ్‌ హోం వచ్చింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులంతా ఇంటి బాట పట్టడంతో ఎక్కడికక్కడ వ్యాపారాలు పుంజుకున్నాయి. 35 వేల మందికి పైగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రూపంలో జిల్లాకు వచ్చినట్లు సమాచారం. గతంలో వీరంతా కూడా తాము ఉద్యోగాలు చేసే నగరాల్లో వేతనాలను ఖర్చు చేసేవారు. ఇది ఎంతలేదన్నా సుమారు 1500 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా ఇందులో కనీసం వెయ్యి కోట్ల వరకు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉద్యోగులు ఏదో ఒక రూపంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది.  కరోనాకు ముందు కన్నా గుంటూరు నగరంలో శని, ఆదివారాల్లో  కొన్ని వ్యాపారాలు పుంజుకున్నట్లు ఆయా వర్గాల అభిప్రాయం.  ముఖ్యంగా బంగారం, పెద్దపెద్ద హోటళ్లు, ఫర్నీచర్‌, ఆన్‌లైన్‌ ఫుడ్‌ బిజినెస్‌ తదితర రంగాలకు వర్క్‌ఫ్రమ్‌ హోం ఊతంగా మారింది. కరోనా రాకముందు వీరంతా వేతనాలు మొత్తం మెట్రో నగరాల్లో వివిధ రూపాల్లో వెచ్చించేవారు. ఇది ఆయా నగరాలకు వరంగా ఉండేది. వర్క్‌ఫ్రమ్‌ హోంతో మెట్రోలో ఆయా రంగాల వ్యాపారం పూర్తిగా పడకేసింది. ఈ కారణంగానే ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మినహాయించి కంపెనీలకు రప్పించాలని సూచించారు.  


కోడళ్లకు కష్టాలు

వర్క్‌ ఫ్రమ్‌ హోం అందరికీ బాగున్నా.. కోడళ్లకు మాత్రం కష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో భర్త, పిల్లలతో కలిసి తమకు నచ్చిన రీతిలో మెట్రో నగరాల్లో జీవనం సాగించేవారు. అయితే వర్క్‌ఫ్రమ్‌హోంతో మెట్రోలను వదిలి ఇళ్లకు రావడంతో వారి జీవనశైలిలో మార్పు జరగలేదు. ఇది ఇంటి వద్ద ఉండే పెద్దలకు నచ్చడంలేదు. అత్తల పోర్లు, ఎక్కువ సేపు ఇంట్లోనే గడపాల్సి రావడం, పనులు ఎక్కువ అవడం తదితరాలతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది కోడళ్లు  వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎప్పుడు పోతుందా నగరాలకు ఎపుడు పోదామా అని ఎదురుచూస్తున్నారు.  


 

పొదుపు పెరిగింది

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా పొదుపు పెరిగింది. గతంలో హైదరాబాద్‌లో ఉండేవాడిని. వచ్చిన వేతనంలో 30 శాతం వరకు ఇంటి అద్దె, రవాణా ఖర్చులు, శని, ఆది వారాలలో షాపింగ్‌కు ఖర్చయ్యేవి. ఇప్పుడు అవి లేకపోవడంతో ఏడాది కాలంగా లక్షల్లోనే పొదుపు చేయగలిగాను. దీనికి తోడు తల్లిదండ్రుల వద్దే ఉండటంతో వారు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. 

- పులిగడ్డ నాగరాజు, నల్లచెరువు 23వ లైను, గుంటూరు


వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ బాగుంది

పుట్టిన ఊరిమీద ఎవరికైనా మమకారం ఉంటుంది. నాకూ అంతే బెంగళూరులో పదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో ఉన్నాను. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా సొంత గ్రామంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పనిచేసుకుంటూ సంపాదించుకుంటున్నాను. ఇది చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంటర్నెట్‌ వంటి సదుపాయలు గ్రామాల్లో ఇంకా వేగవంతం చేయాలి. పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు కూడా లభిస్తే ఎప్పుడూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోరుకుంటాం.

- బోయినపల్లి వెంకటరావు,  వెలమవారిపాలెం, నగరం మండలం


 =================================================================================================================

Updated Date - 2021-08-15T05:04:51+05:30 IST