రైతులకు క్షమాపణలు చెప్పే వరకు ఖట్టర్‌తో మాట్లాడను: అమరీందర్ సింగ్

ABN , First Publish Date - 2020-11-29T01:58:01+05:30 IST

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ క్షమాపణలు చెప్పేంత వరకు తాను ఆయనతో మాట్లాడబోనని పంజాబ్ ముఖ్యమంత్రి

రైతులకు క్షమాపణలు చెప్పే వరకు ఖట్టర్‌తో మాట్లాడను: అమరీందర్ సింగ్

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ రైతులకు క్షమాపణలు చెప్పేంత వరకు తాను ఆయనతో మాట్లాడబోనని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెగేసి చెప్పారు. ఖట్టర్ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని, పరిమిత పాత్ర మాత్రమే ఉన్న రాష్ట్రం ఇందులో జోక్యం చేసుకుంటోందని అన్నారు. 


‘‘ఖట్టర్ అబద్ధాలు చెబుతున్నారు. ఇంతకుముందు ఆయన నాకు ఫోన్ చేశారు. నేను స్పందించలేదు. మా రైతులకు ఇంత చేశాక, ఆయన పదిసార్లు ఫోన్ చేసినా నేను మాట్లాడను. చేసిన తప్పును అంగీకరించి, పంజాబ్ రైతులకు క్షమాపణలు చెప్పే వరకు నేను మాట్లాడను. ఆయనను క్షమించను’’ అని అమరీందర్ సింగ్ తేల్చి చెప్పారు. 


నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన నేడు కూడా కొనసాగింది. కాగా, రైతుల ఆందోళనను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ఉపయోగించేందుకు హర్యానా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన పంజాబ్ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 


రైతుల సమస్యపై సీఎం ఖట్టర్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చాలాసార్లు మాట్లాడగలిగితే, ఈ విషయంపై చర్చించడానికి పొరుగున ఉన్న ముఖ్యమంత్రి నుంచి వచ్చే కాల్స్ ఎందుకు తీసుకోలేదని పంజాబ్ సీఎం ప్రశ్నించారు. రైతులతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ, ఢిల్లీ ప్రభుత్వానికి సమస్య లేకపోయినప్పటికీ రైతుల మార్చ్‌కు అనుమతి ఇవ్వకూడదన్న ఖట్టర్ నిర్ణయాన్ని అమరీందర్ ప్రశ్నించారు. ‘‘అసలు ఈ సమస్య మధ్యలోకి రావడానికి ఖట్టర్ ఎవరు? ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఆయనకేముంది?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కాగా, శనివారం హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రదర్శనలో ‘ఖలిస్థాని’ వేర్పాటు వాదులున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈ విషయంలో తమకు కచ్చితమైన ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయని పేర్కొన్నారు. అయితే, ఆ వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఖట్టర్ చెప్పారు. 

Updated Date - 2020-11-29T01:58:01+05:30 IST